వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోవ్యవసాయినామ్
(భగవద్గీత 2-41)
‘ఓ కురునందనా.. అర్జునా! ఎవరి బుద్ధి అయితే వ్యవసాయాత్మికమై, నిరంతర ప్రయత్నశీలమై ఒకే మార్గంలో లక్ష్యం వైపు కేంద్రీకరించిన దృష్టితో స్థిరంగా పయనిస్తుందో అతను ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రపంచం మొత్తం తనకెదురుగా నిలిచినా తన సాధనా ప్రయత్నాన్ని విడువడు. ఎవరి బుద్ధి అనేక శాఖలుగా వ్యాప్తమై స్థిర సంకల్పాన్ని సాధించదో వారు దేనినీ సాధించలేరు’ అంటాడు కృష్ణుడు.
వ్యవసాయాత్మకం అనడం వల్ల నిశ్చయమైనది అని భావం. సాధారణంగా మనసుగా ఉన్నది.. మనస్, బుద్ధి, అహంకారం, చిత్తముల పేర నాలుగు విధాలుగా వ్యవహరిస్తుంది. మనస్.. చంచలమై లోక వ్యవహారాలను నిర్వహిస్తుంది. బుద్ధి.. మంచి చెడులను వివేకంతో నిర్ణయిస్తుంది. అహంకారం.. నేనే అనే భావనను కలిగిస్తుంది. చిత్తం.. సంచిత కర్మఫలాలను అందిస్తుంది. పట్టుదలతో చేసే ప్రయత్నం కర్మఫలితాలనూ మారుస్తుంది. విచక్షణ జ్ఞానంతో మనసును బుద్ధి నడిపిస్తే.. కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించడం జరుగుతుంది.
నేను, నావారు అనే భావనలకు పరిమితమైన బుద్ధి.. అహంకార మమకారాలకు ఆశ్రయమిస్తూ.. చంచలత్వాన్ని పొందుతుంది. నిరంతర సాధనవల్ల బుద్ధిని ఏకమార్గంలో ప్రవేశపెడితే.. అనేకత్వం ఏకత్వానికి మారుతుంది.. ఏకాగ్రతను సాధిస్తుంది. ఏ బాహ్య ప్రలోభాలకు, ఒత్తిడులకు లొంగకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడమే ‘స్వధర్మం’. వ్యక్తి నిశ్చలమైన మనసుతో స్వధర్మాన్ని అనుష్ఠించాలి. గద్ద ఎంత ఎత్తులోనున్నా, భూమిపైనున్న తన లక్ష్యంపై ఎలాగైతే దృష్టి చెదరనీయదో.. అలాగే సాధకుడు కూడా తన లక్ష్యం నుంచి దూరంగా జరగకూడదు. అనునిత్యం తనను తాను ఆత్మావలోకనం చేసుకునే వ్యక్తి మనసు, వివిధ శాఖలుగా విస్తరించే అవకాశం తక్కువ.
తన జీవన ప్రయోజనం ఏమిటో తెలియని వ్యక్తి చిమ్మచీకటిలో అడవిలో తిరుగుతున్నట్టుగా సంచరిస్తుంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తి లక్ష్యం కేంద్రంగా తన మార్గాన్ని నిర్ణయించుకొని ఆ మార్గంలో పయనిస్తాడు. అయితే ప్రక్రియపై దృష్టిని పెట్టి నిశ్చితాభిప్రాయుడై నడిచే వ్యక్తి లక్ష్యానికి దగ్గరవుతాడు. అలాకాని నాడు వ్యగ్రమైన మనసు చంచలత్వాన్ని ఆశ్రయించి అనేకమై, ఫలితాపేక్షతో ఒత్తిడికి లోనై, తెగిన గాలిపటంలా గమ్యహీనమైన మార్గంలో తిరుగుతూ అపజయాన్ని పొందుతాడు.
మనో నియంత్రణ లేని వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న దానిని కూడా గ్రహించలేక నిర్వహణా లోపం వల్ల అపజయాన్ని మూటగట్టుకోవడమే కాక.. ఇతరులు పన్నిన వలలో పడిపోతాడు. నిర్ణయాత్మకమైన ఉన్నత పదవిలో.. మనసుపై అదుపులేని, అనుభవం అర్హతలులేని వ్యక్తులు కూర్చొని హానికరమైన నిర్ణయాలు తీసుకుంటే.. సంస్థలు నిర్వీర్యమవుతాయి. అలాగే ప్రలోభాలకు లోనైన వ్యక్తి నిర్ణయాలూ వ్యవస్థను అవస్థలపాలు చేస్తాయి. ఇలాంటివారు.. తమ అసమర్థతను ఇతరులపై నెట్టివేయడం వల్ల ఆ సంస్థతోపాటు దానిపై ఆధారపడిన వారంతా బాధపడాల్సి వస్తుంది. అందుకని నాయకుడు.. తన మనసును ఏకీకృతం చేసి, దృఢదీక్షతో కర్తవ్యాన్ని నిర్వహించాలి. అప్పుడే వ్యక్తిగతమైన పురోగతి.. సామాజిక అభ్యున్నతి సాధ్యపడుతుంది.
– పాలకుర్తి రామమూర్తి