జీవితం అమూల్యమైనది. ఎవ్వరికైనా ఒక్కసారే దొరుకుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవాలి. అర్థవంతంగా గడపాలని చెబుతుంది ఖురాన్. ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఈ జీవిత ప్రయాణం ముగిసినట్లే. అందుకే జీవితాన్ని వరంగా భావించాలి. మనిషికి లభించే ఆయుష్షు కేవలం పరీక్ష మాత్రమే! సుఖదుఃఖాలైనా, ఆకలిదప్పులైనా, కలిమిలేములైనా అన్నీ మానవుణ్ని పరీక్షించడానికే అని చెబుతుంది ఖురాన్. మనిషి బతికి ఉండగా తాను చేసుకున్న కర్మలకు పరలోకంలో అల్లాహ్కు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ముహమ్మద్ ప్రవక్త (సఅసం) పేర్కొన్నారు. ఇక్కడ మనిషి అనుభవించిన అనుగ్రహాల విషయంలో రేపు పరలోకంలో దైవం లెక్క తీసుకుంటాడని, కాబట్టి జవాబుదారీతనంతో జీవితాన్ని గడపాలని ప్రవక్త హెచ్చరించారు. ‘మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది’ (దివ్య ఖురాన్ 2: 21) అని ఖురాన్ స్పష్టం చేసింది.
‘విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చెయ్యండి, మీ ప్రభువుకు దాస్యం చెయ్యండి, మంచిపనులు చెయ్యండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుందని ఆశించవచ్చు’ అని ఖురాన్ బోధ (22:77). పైన పేర్కొన్న ఖురాన్ బోధనలు మన జీవిత లక్ష్యాన్ని స్పష్టపరుస్తున్నాయి. మనిషి జీవితాంతం తన పుట్టుకను, మరణాన్ని ప్రసాదించే వాడిని ఆరాధించడమే మానవ జీవిత లక్ష్యమని ఖురాన్ విడమర్చి చెప్పింది. ఆరాధన అంటే కేవలం నమాజులు, ఉపవాసాలు, హజ్ యాత్ర వరకే పరిమితం కాదు. ఆరాధన అంటే జీవితంలోని అన్ని రంగాలలో దైవధర్మం ఉట్టిపడాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బజారులో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, మంత్రిగా ఉన్నా ఇలా అన్ని రంగాల్లో దేవుడి ధర్మాదేశాలను పాటించాలన్నదే అల్లాహ్ ఆదేశం. ప్రతీక్షణం ఆ అల్లాహ్ మనల్ని కనిపెడుతూ ఉన్నాడనే భావన మనలో స్ఫురించాలి. మన హక్కులు, బాధ్యతలు సవ్యంగా నెరవేర్చాలి. మంచిని పెంచుతూ చెడును తుంచే పనికి పూనుకోవాలి. అల్లాహ్ ప్రసాదించిన ఈ అమూల్యమైన జీవితాన్ని దైవం ఆదేశాలకు అనుగుణంగా మలుచుకుంటే పరలోకంలో ఎప్పటికీ అంతంకాని శాశ్వతమైన స్వర్గవనాలకు అర్హత సాధించవచ్చు.