ఖురాన్ ‘హృదయం (గుండె)‘ గురించి వివరంగా చర్చించింది. సుమారుగా 130 సార్లు హృదయానికి సంబంధించిన వాక్యాలు ఈ పవిత్ర గ్రంథంలో కనిపిస్తాయి. గుండెను ఖురాన్ ఖల్బ్ అని సంబోధించింది. ఖల్బ్ అంటే ‘తిరగడం’ అని అర్ధం. ‘శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది, అది మంచిగా మారితే శరీరం మొత్తం బాగుంటుంది, కానీ అది చెడిపోతే శరీరం అంతా చెడిపోతుంది. అదే హృదయం’ అన్నారు ప్రవక్త ముహమ్మద్. ఇస్లాం ప్రకారం మనుషుల హృదయాల్లో వివిధ రకాలు ఉన్నాయి. దృఢమైన హృదయం అంటే అహంకారం లేనిది. జబ్బుపడిన హృదయం అంటే వ్యర్థమైన కోరికలతో నిండి ఉండేది. హృదయంలో అల్లాహ్ పట్ల వినయ విధేయతలు లేనప్పుడూ అది కఠినంగా మారుతుంది. కోరికలకు బానిసైన వారి హృదయాలు ఎప్పుడూ చెడు గురించే ఆలోచిస్తుంటాయి! అయితే కోరికలకు బానిస కాకుండా తమ అవసరాలను హలాల్ మార్గంలో తీర్చుకోవడం ద్వారా ప్రజలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు దగ్గరవుతారు. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారిని చూసినప్పుడు భావోద్వేగానికిలోనై వారికి చేతనైన సాయం చేయాలి. అప్పుడే వారి హృదయం కుదుట పడుతుంది. ‘అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలకు తృప్తి కలిగే భాగ్యం లభిస్తుంది (13:28)’. అందుకే మంచి హృదయం ఇవ్వమని ఆయనను ప్రార్థించాలి. అల్లాహ్ను ఎక్కువగా స్మరిస్తే మన ఉద్దేశాలు, హృదయం స్వచ్ఛంగా ఉంటాయి.