ఒకసారి క్రీస్తు తన శిష్యులతో కలిసి ఓ గ్రామాన్ని సందర్శించాడు. సమయం మించిపోవడంతో శిష్యులు స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో యూదుల మతాచారం ప్రకారం.. భోజనానికి ముందు స్నానం చేయాలి. కనీసం శరీరంపై నీళ్లయినా చల్లుకోవాలి. వాటికి విరుద్ధంగా భోజనానికి ఉపక్రమించిన శిష్యులను చూసిన ఆనాటి మత పెద్దలకు అది రుచించలేదు. విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు క్రీస్తు వారితో.. ‘వెలుపలి నుంచి లోపలికి పోయి మనుషులను అపవిత్రులను చేసేది ఏదీ లేదు.
కానీ, లోపల నుంచి బయటకు వెళ్లినవే మనుషులను అపవిత్రులను చేస్తాయి’ అన్నారు. ఇక్కడ ప్రభువు ఉద్దేశంలో లోపల నుంచి బయటకు వెళ్లేది.. నోటిలోంచి వెలువడే మాట! ఇది హృదయం నుంచి వస్తుంది. లోపల ఉన్న దురాలోచనలు, వైషమ్యాలు, క్రోధం, అహం వంటివి మాటలుగా బయటపడి అవి మనుషులను అపవిత్రం చేస్తాయి. ఫలితం పరస్పర వైషమ్యంతో మిత్రులు, శత్రువులుగా మారే ప్రమాదం ఉందని ప్రభువు ప్రవచనంలోని పరమసత్యం.
– దేవదాసు