జీవం, పునరుత్థానం అనేవి ప్రభువులో కనిపిస్తాయి. కొన్ని అద్భుతాల్లో జీవం అనేది నిరూపితమైతే, చనిపోయిన లాజరుని మళ్లీ బతికించిన ఘట్టంలో పునరుత్థానం రుజువైంది. ‘నేనే మార్గం, సత్యం, జీవం’ (యోహాను 14:6) అని ప్రకటించుకున్న ప్రభువే, ‘నేనే పునరుత్థానం’ (యోహాను 11:25-26) అని కూడా పేర్కొన్నాడు. క్రీస్తును ఎలాగైనా తప్పుపట్టాలని చూస్తున్న యూదు పెద్దల్లో.. ఈ రెండు మాటలూ మంటలు రేపాయి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, అంధునికి చూపునివ్వడం, తుఫాన్‌ను అణచివేయడం, ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదు వేలమందికి ఆహారంగా అందించడం తదితర సంఘటనల్లో క్రీస్తులోని జీవశక్తి ప్రస్ఫుటమైంది. రెండోది ఆయన మరణిస్తే గానీ తెలిసే అవకాశం లేదు. కానీ, ఓ సంఘటన కారణంగా ముందుగానే అది వ్యక్తమైంది. బెతానియా గ్రామంలో మరియ, మార్త అనే అక్కాచెల్లెళ్లు ఉండేవారు.
వారికో సోదరుడు. అతని పేరు లాజరు. ఆ కుటుంబం ప్రభువుకి బాగా సుపరిచితం. ఒకసారి అకస్మాత్తుగా లాజరు చనిపోయాడు. ఆ సమయంలో ఎక్కడికో దూరప్రాంతానికి వెళ్లిన ఏసుక్రీస్తు నాలుగు రోజుల తర్వాత బెతానియా చేరుకుంటాడు. తమ నివాసానికి వస్తున్న ప్రభువుకు మార్త ఎదురు వెళ్తుంది. మీరున్నట్లయితే నా సోదరుడు చనిపోయేవాడు కాదని కన్నీటి పర్యంతం అవుతుంది. ప్రభువును ప్రార్థించి ‘నీ మహిమను ప్రకటించేందుకు’ అని సమస్యను దేవుడి ముందు ఉంచింది. ప్రభువు అనుగ్రహించాడు. అక్కడి ప్రజల విశ్వాసం మరింత గట్టిపడేటట్టుగా సమాధి రాయి పక్కకు తొలగించి ‘లాజరూ! వెలుపలికి రా!’ అని పిలిచాడు ప్రభువు. చనిపోయిన వాడు లేచి, నడిచొచ్చాడు. అందరూ ఆ మహత్తర అద్భుత శక్తికి ఆశ్చర్యపడి ప్రభువును కొనియాడారు. (యోహాను 11:17-44)