యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్ (కేనోపనిషత్తు) ‘ఎవడు బ్రహ్మమును తెలుసుకోలేమని ఎరుగునో అతనే తెలుసుకొన్నవాడు. ఎవడు తెలుసుకున్నాను అనుకుంటాడో అతను బ్రహ్మమును ఎరగని వాడు’ అని పై శ్లోకానికి అర్థం.
ఒకసారి దేవతలు రాక్షసులను జయించారు. సురలకు గర్వం తలెత్తింది. విజయానికి కారణం పరబ్రహ్మ శక్తి అని మరచిపోయారు. బ్రహ్మతత్వం గుణపాఠం నేర్పడానికి యక్ష రూపంలో ప్రత్యక్షమైంది. ఆ తత్వాన్ని తేల్చుకోలేకపోయారు దేవతలు. అగ్నిదేవుడితో అదేమిటో చూసి రమ్మన్నారు. అగ్ని వెళ్లగా ఆ భయంకర శక్తి.. ‘నీ శక్తి సామర్థ్యా లేమిటి?’ అన్నది. ‘నేను అన్ని వస్తువులనూ భస్మీపటలం చేసేస్తాను’ అన్నాడు అగ్ని. ఆ శక్తి.. ఒక గడ్డిపోచను విసిరి ‘దీనిని దగ్ధం చెయ్యి చూద్దాం’ అన్నది. అగ్ని ఎంత ప్రయత్నించినా దానిని కాల్చలేకపోయాడు. తర్వాత దేవతలు వాయుదేవుడిని ఆ శక్తి దగ్గరికి పంపారు.
వాయువు ‘నేను ఎంతటి వస్తువునైనా ఎగురగొట్టగలను’ అన్నాడు. ‘ఈ గడ్డిపోచను ఎగురగొట్టు, చాలు’ అన్నదా శక్తి. బలాన్ని అంతా కూడగట్టుకున్నా వాయువు దాన్ని కొంచెమైనా కదల్చలేకపోయాడు. చివరిగా దేవేంద్రుడు వెళ్లాడు. ఆ తత్వం అదృశ్యమై అందమైన స్త్రీ మూర్తి ప్రత్యక్షమైంది. ఆమే హిమవత్ పుత్రి.. శక్తి. ఆమెతో ఇంద్రుడు ‘దేవీ! దేవతలను భయభ్రాంతులను గావించిన యక్షతత్వం ఏమిటి? అని ప్రశ్నించాడు.
ఉమాదేవి ఇలా ఉపదేశించింది.. ‘ఇంద్రా! అదే బ్రహ్మము. దాన్ని మీరు తెలుసుకోలేదు. బ్రహ్మతత్వమే మీలో శక్తిని పూరిస్తున్నది. దానివల్లే మీరు విజయాన్ని సాధించారు. యథార్థమూ, జీవితపరమార్థమూ అదే! అహంకారం ఆత్మజ్ఞానాన్ని హరిస్తుంది సుమా!’ అని హెచ్చరించింది. కాబట్టి బ్రహ్మం ఒక దృశ్య పదార్థం కాదని, దాన్ని తెలుసుకోలేమని.. గ్రహించాలి. మేమే గొప్ప అనుకోకూడదని ఈ ఉపనిషత్ కథ బోధిస్తుంది.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ