అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః॥
(భగవద్గీత 8-3)
అర్జునుడు కృష్ణుడిని ‘బ్రహ్మం, ఆధ్యాత్మం, కర్మలు అనగా ఏమిటి? ఏది అధిభూతంగా చెప్పబడింది?
అధిదైవమని దేనినంటారు? అధియజ్ఞుడు ఎవరు?
అతనిని తెలుసుకోవడం ఎలాగా?’ అంటూ ఏడు ప్రశ్నలు అడిగాడు.. వాటికి పరమాత్మ సంక్షిప్తంగా సమాధానాలు ఇస్తున్నాడు.
బ్రహ్మం అంటే అన్నింటికన్నా ఉత్తమోత్తమమైన వస్తువు. స్వభావాన్ని ప్రత్యగాత్మ అన్నారు. ప్రత్యగాత్మ అంటే.. ప్రత్యక్ (లోనికి వెళ్లేది) ఆత్మ (నేను అనే అస్తిత్వం).. ఏది లోనికి వెళుతుంది? ఏది బయటికి వచ్చిందో అదే లోనికి వెళుతుంది. నేను అంటే ఎవరు అని విమర్శ చేసుకునే సమయంలో శరీరభాగాలు కాని, దేహం కాని, మనసు కాని నేను కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు… ఆత్మ అనేదే స్వభావమని అవగతమవుతుంది. ఈ స్వభావాన్నే ఆధ్యాత్మం అంటారు. ఇక్కడ ఒక అనుమానం. జీవులందరూ వస్తున్నారు అంటే జన్మిస్తున్నారు.. పెరుగుతున్నారు.. అలాగే మరణిస్తున్నారు. అంటే లోనికి వెళుతున్నారు..
ఇలా ఎంత కాలం జరుగుతుంది? కొంతకాలానికి అయిపోదా? మన ఇంటిలో ప్రతిరోజూ భుజిస్తున్నాం. అందుకోసం పదార్ధాలు తెచ్చుకుంటున్నాము. పదార్ధాలకు డబ్బు చెల్లిస్తున్నాం. డబ్బు సంపాదనకు నిరంతరం పనిచేస్తున్నాం. ఎంతవరకు పనిచేసి డబ్బు సంపాదిస్తామో అంతవరకు ఇంటిలో పదార్ధాలు అయిపోయే అవకాశం లేదుకదా! అనగా అయిపోని లక్షణం లేదా ధర్మం అనేది పదార్ధాలలోనూ, చేసే పనిలోనూ, గడించే డబ్బులోనూ ఉన్నది. అన్నింటికీ కేంద్రమై నిలిచే డబ్బును గడించినంత వరకు అది అయిపోదు.
నిజానికి వ్యష్టి సమష్టిగా మారడమే.. ఆధ్యాత్మం. బాధ్యతా నిర్వహణే ఆధ్యాత్మికత. అంకిత భావనతో చేసే పనే ఆరాధన! వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా, సమాజపరంగా తన బాధ్యతను నిర్వహించిన వ్యక్తిలో ఉత్తమత్వం ఆవిష్కృతమవుతుంది.
ప్రపంచ ఆవిర్భావానికి మూలమైన యజ్ఞాదుల నిర్వహణే కర్మం. యజ్ఞం వల్ల వర్షాలు, వర్షాల వల్ల పంటలు, వాటి వల్ల ప్రాణుల ఉత్పత్తి, పోషణ జరుగుతుంది. కాబట్టి తాత్వికంగా యజ్ఞాదుల నిర్వహణే కర్మ. విత్తనాన్ని భూమిలో వేస్తాం. అది పంచభూతాల సహకారంతో మొలకెత్తుతుంది. తిరిగి విత్తనంగా మారుతుంది. ఇలా మొలకెత్తడం.. విత్తనంగా మారే ప్రక్రియయే సృష్టిలోని పనితనంగా చెబుతారు. ఆ పనితనాన్నే కర్మ అంటారు. చేసేపనిని కూడా వ్యావహారికంగా కర్మ అంటారు. కాని, చేసే పనులు మాత్రమే కర్మలు కావు. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ తనదే అనుకుంటే.. ఆ సంస్థ లాభనష్టాలకు బాధ్యుడిగా ఒత్తిడికి లోనవుతాడు. దానినే కర్మబంధం అంటారు. తాను నిమిత్త మాత్రుడినని, ఫలితానికి తాను బాధ్యుడను కానని, బాధ్యతను మాత్రమే నిర్వహిస్తానని భావిస్తే ఒత్తిడికి దూరమవుతాడు. యజమాని భగవంతుడే, జీవులు ఆయన క్రీడలో భాగమని భావిస్తే సుఖదుఃఖాల గురించిన చింతన ఉండదు.
అధిభూతం అంటే.. నశించు పదార్ధం. కనిపించే పదార్ధమంతా నశిస్తుంది. నిజానికి సృష్టిలో ఏదీ నాశనం కాదు.. రూపాన్ని మార్చుకుంటుంది. రూపాన్ని మార్చుకునే లక్షణమే అధిభూతం అన్నారు. అధిదైవం అంటే.. నాశరహితుడైన విరాట్పురుషుడు లేదా పరమాత్మ. అధియజ్ఞుడు అంటే ప్రతిజీవిలోనూ ఆత్మరూపంలో ప్రకాశించే పరమాత్మ.
ఆ పరమాత్మను తెలుసుకోవడం ఎలా? జీవితమంతా భగవత్ ధ్యానంలో గడిపినవాడు అంత్యకాలంలో కూడా అదే స్మరణలో ఉంటే.. ఆ వ్యక్తికి మోక్షం కలుగుతుంది. లేదా.. పరమాత్మను చేరుకుంటాడు. దీనిలో ఎలాంటి సంశయమూ లేదంటాడు పరమాత్మ. యద్భావం తద్భవతి అన్నట్లుగా దేనిని గురించి మనం నిరంతరం స్మరిస్తామో అవే సూచనలుగా అంతర్మనసుకు చేరి దానిలో ముద్రితమవుతాయి. ఆ సూచనలు బలోపేతమైతే అంతర్మనస్సు దానిని కార్యరూపంలో ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతుంది. అందువల్ల ప్రతివ్యక్తీ భౌతిక జీవితంలో తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ… ఫలితాన్ని పరమాత్మకు విడిచిపెట్టి నిరంతరం ఆయన స్మరణలో ఉంటే.. ఆ వ్యక్తి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు. యోగం అంటే.. అర్హత ప్రకారం పొందదగినది. క్షేమం అంటే.. పొందినది కాపాడుకోవడం.
– పాలకుర్తి రామమూర్తి