తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్దూతకల్మషాః॥
(భగవద్గీత – 5-17)
పరమాత్మయందు బుద్ధిగలవారు, పరమాత్మయందు మనసును నిలిపినవారు, పరమాత్మయందే నిష్ఠగలవారు, పరమాత్మనే పరమగతిగా భావించేవారు, జ్ఞానసాధనలో పాపాలను కడిగివేసుకొని, సదా పరమాత్మ యందే ఏకాగ్రచిత్తులై, పునర్జన్మ లేని పరమగతిని పొందుతారని అంటున్నాడు శ్రీకృష్ణుడు.
కార్యసాధనకు ఏకాగ్రత, తదేక చింతన, తన్మయత్వాలే సాధనాలు. ఏకాగ్రత వల్ల తదేక చింతన, దానితో తన్మయత్వం, తద్వారా లక్ష్యాన్ని చేరడం సాధ్యపడుతుంది. భ్రమరకీట న్యాయం ప్రకారం.. మనసు దేనిపై పూర్తిగా లగ్నమవుతుందో దానినే అంతర్మనస్సు సాకారం చేస్తుంది. తన శక్తియుక్తులను పూర్తిగా వెచ్చించి, ఆలోచనను క్రమబద్ధీకరించి లక్ష్యంపై దృష్టిని నిలిపి పట్టుదలతో, నిరంతరం ప్రయత్నించే సాధకుడు.. ప్రేయస్సును (ప్రగతిని), శ్రేయస్సును (సుగతిని) పొందగలడు. జ్ఞానం, నైపుణ్యం కలిస్తే విజయం. జ్ఞానం వెలుగుకు, అజ్ఞానం చీకటికి ప్రతీకలు. సూర్యుడు ఉదయించి చీకటిని పారద్రోలినట్లు, మనసులో జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తే అజ్ఞానమనే చీకట్లు పారిపోతాయి.
‘తత్’ అంటే ‘అది’.. అనగా దేనినైతే గుర్తిస్తామో.. దానికి అతీతమైనది భగవంతుడు లేదా సర్వవ్యాప్తమై ఉండే అనంతశక్తి. ‘రాకపోకలు’ కలిగినది సృష్టి. వివిధ ఆభరణాలలో ఉండేది బంగారమే అయినా ఆ బంగారమనేది ఆభరణాలకు ఎలాగైతే అతీతమైనదో అలాగే సృష్టి అంతటా వ్యాప్తమైన భగవంతుడూ సృష్టికి అతీతుడు. దీనిని తెలుసుకునేందుకు అవసరమైనది జ్ఞానం. జ్ఞానార్జనకు అవసరమైనది సాధన. అది ఎలా ఉండాలో చెబుతున్నాడు, కృష్ణపరమాత్మ.
‘తద్బుద్ధయః’.. దేనిని సాధించాలని సంకల్పించామో దానిపై బుద్ధి పూర్తిగా సుస్థిరం కావాలి లేదా లగ్నం కావాలి. ‘తదాత్మానః’.. లక్ష్యంతో త్రికరణ శుద్ధిగా మమేకం కావాలి. ‘తన్నిష్ఠా’.. లక్ష్యంపై చెదరని నిష్ఠ అవసరం. నిష్ఠ అంటే శ్రద్ధాసక్తులు, లక్ష్యసాధనపై స్పష్టత, అలోచనలలో చురుకుదనం, పరిస్థితుల పట్ల అప్రమత్తత, బుద్ధితో సకారాత్మక ఆలోచనలు చేయడం… దీనికి నియమాలతో కూడిన క్రమశిక్షణ తోడైతే.. కార్యం సాకారమవుతుంది. ‘తత్పరాయణ’.. ఆలోచనలన్నీ సంకల్పిత లక్ష్యంపై పరిసమాప్తం కావాలి. నిశ్చలమైన నీటిలో గులకరాయిని వేస్తే చెలరేగిన తరంగాలు ఎలాగైతే ఒడ్డును చేరి పరిసమాప్తం అవుతాయో… అలాగే భగవంతుడిపైనే ఆలోచనలు పరిసమాప్తం కావాలి. త్రికరణ శుద్ధిగా లక్ష్యంపై ఎవరికైతే ‘తద్బుద్ధియః, తదాత్మానః, తన్నిష్ఠాః, తత్పరాయణత’ కలిగి ఉంటుందో వారు తాము ‘ఎదిగిన స్థితి నుంచి పతనం కారు’ అంటున్నాడు పరమాత్మ.
ఈ శ్లోకం ఆధ్యాత్మిక సాధకులకే కాదు.. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, గృహిణులైనా, చేసే పనిపై పూర్తిగా మనసును ఏకాగ్రం చేసి, నిబద్ధతతో, నిష్ఠతో పనిని ఉపాసనగా భావించాలి. శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించి కర్తవ్యాన్ని నిర్వహిస్తే… చేస్తున్న పనిలో విజయాన్ని సాధించడమే కాక… అఖండమైన ఆనందాన్ని పొందుతారు.
పానీయంబులు త్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్.. అని ప్రహ్లాద చరిత్రలో పోతన చెప్పిన విధంగా.. లక్ష్యం చేరాలనే తపనతో ఏ పని చేసినా దానిని భగవంతుడి సేవగా భావిస్తూ కర్తవ్యాన్ని ఉపాసనగా నిర్వహించే సాధకులది భౌతిక లక్ష్యమైనా.. ఆధ్యాత్మిక లక్ష్యమైనా.. విజయాన్ని సాధిస్తారు. పనిని ఉపాసనగా భావించడం అంటే వ్యక్తి చేసే పని చిన్నదా పెద్దదా అనికాదు.. దానిని ఎంతటి ఏకాగ్రతతో, నిష్ఠతో చేస్తున్నారన్నదే విచారణీయం. రోడ్డు తుడిచే పనైనా.. దానిపై తుడిచేవారి ముద్ర ఉండాలి. మరెవ్వరూ అంత చక్కగా చేయలేరని పలువురు ప్రశంసించాలి.
లక్ష్యం నిర్దేశించుకోవడంలో స్పష్టత అంటే మనకేమి కావాలో, ఎందుకు కావాలో అవగాహన ఉండాలి. అందరి పట్ల సమభావనను పొందడం, సమన్వయం చేసుకోవడం, సమగ్రతను సాధించడం అవసరం. భగవంతుడు.. అంతటా వ్యాపించాడనే సత్యాన్ని గుర్తించాలి. మనకు అపకారం చేసిన వారైనా.. ఒకరి పట్ల ద్వేషభావన కలిగితే సమగ్రతకు దూరమైనట్లే! లక్ష రూపాయలకు ఒక పైసా తగ్గినా అది లక్షకాదు. ఒకరిపై ద్వేషం కలిగినా… సమగ్రత లోపించినట్లే! భగవంతుడి సంపూర్ణత్వాన్ని భావించనట్లే!!
– పాలకుర్తి రామమూర్తి