ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ. ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణప్రతిష్ఠ ముహూర్తః సుముహూర్తోస్తు స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం తావత్తం ప్రీతిభావనే ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీం పరివార సమేతం శ్రీవరసిద్ధి వినాయకస్వామిన్ స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరోభవ, వరదోభవ ప్రసీదః ప్రసీదః ప్రసీదః
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆవాహనం శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆసనం శ్లో॥ మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న
ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్లు చల్లాలి)
అర్ఘ్యం శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్లు చల్లాలి)
పాద్యం శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి
ఆచమనీయం శ్లో॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖేః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
తెలివితేటలకు గణపతిని ప్రతీకగా భావిస్తారు. వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని రాసింది ఆయనే. వ్యాసుడు భారతం రాయడానికి సర్వజ్ఞుడైన ఒక లేఖకుడు కావాలనుకున్నాడు. వినాయకుడి కన్నా సమర్థుడైన లేఖకుడు మరెవరూ ఉండరని భావించాడు. తాను చెబుతుంటే మహాభారతం రాసి పెట్టాల్సిందిగా గణేశుడిని అడిగాడు వ్యాసుడు. అయితే, గణపతి వెంటనే సమ్మతించలేదు. వ్యాసుడికి పరీక్ష పెట్టాలనుకున్నాడు. ‘మహర్షి తన మనోఫలకంపై దర్శించిన విషయాలు చెబుతారా? పాండిత్య ప్రదర్శన చేస్తారా?’ తెలుసుకోవాలని భావించాడు.
మహాభారతం రాయడానికి అంగీకరిస్తూనే ఒక షరతు విధించాడు. ‘మీరు ఆపకుండా చెబితేనే రాస్తాను, ఎక్కడ తటపటాయించినా ఘంటం పక్కన పెట్టేస్తాను, మళ్లీ ముట్టుకోను’ అంటాడు. అందుకు వ్యాసుడు అంగీకరిస్తాడు. అలా లక్షకుపైగా శ్లోకాలు ఉన్న మహాభారతాన్ని ఆపకుండా చెప్పాడు. వ్యాసుడు చెప్పింది చెప్పినట్టుగా ఆపకుండా కావ్యాన్ని పూర్తిగా రాశాడు గణేశుడు.
గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు?
‘లక్ష్యం లక్షప్రదో లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః లాసప్రియో లాస్యపరో లాభకృల్లోక విశ్రుతః॥’అంటుంది గణపతి సహస్రనామ స్తోత్రం. లోకఖ్యాతి గడించిన వినాయకుడిని ‘లడ్డుక ప్రియః’ అని గణేశ పురాణమూ చెబుతున్నది. అందుకే వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, మోదక్లతోపాటు లడ్డూలనూ నివేదనగా సమర్పిస్తారు.
‘ముదాకరాత్త మోదకం, సదా విముక్తి సాధకం’ అని గణేశ పంచరత్న స్తోత్రంలో గజాననుడిని స్తుతించారు ఆదిశంకరాచార్యులు. ‘మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా!’ అని కీర్తించారు. గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది.
ఒకసారి బాల గణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తుంటారు. గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. వారికి ఘనమైన అతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులు. ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి.
ఎంత తిన్నా, బొజ్జ గణపయ్య ఆకలి తీరదు. అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది. అది తినగానే గణపతి బొజ్జనిండి 21సార్లు త్రేన్చాడట! అప్పటినుంచి 21 కుడుములు, 21 ఉండ్రాళ్లు గణపతికి నైవేద్యంగా పెట్టి, ఒక్కోటి గణపతికి ఇచ్చి, పదేసి చొప్పున దానం చేసి, మిగతావాటిని ప్రసాదంగా తీసుకుంటారు. వినాయక మంటపాల్లో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి నైవేద్యం సమర్పించే ఆచారం ఉంది.