శుకుడు పరీక్షిత్తుతో ఇలా పలికాడు.. రాజా! ఒకనాడు కైలాసగిరిపై కొలువుతీరి ఉన్న మన్మథారి- మహేశ్వరుడు, మురారి- మాధవుని మోహినీ అవతారం గురించి విన్నాడు. కుతూహలం కొద్దీ సతీసమేతంగా శ్రీపతి దర్శనార్థమై వైకుంఠానికి విచ్చేశాడు. ఉభయ కుశలోపరి- గిరీశుడు మందరగిరి ధారి శౌరితో చనువుగా ఇలా అన్నాడు ‘మాధవా! మహిమతో కూడిన నీ మగపోడిమిని ఎన్నో మారులు కన్నులారా కన్నాము. వీనులలర విన్నాము. కానీ, నీ ఆడసోయగాన్ని ఏనాడూ చూడలేదు. మోహినిగా నీవు దానవులను మోసగించి దేవతలకు సుధను పంచిపెట్టిన ఆ ముగ్ధమనోహర రూపాన్ని శ్రీహరీ! నాకు ఒక్కసారి చూపించు. నా మనసు తహతహలాడుతోంది’ అలా విన్నవించుకొన్న పన్నగ భూషణుని పలుకులకు గంభీరంగా నవ్వుతూ ఆపన్న శరణ్యుడు వాసుదేవుడు.. ‘వామదేవా! నా కామినీ రూపం చూడాలనుకుంటే చూపుతా’ అని పలికి మాయమైపోయాడు.
ఇంతలోనే శ్రీకాంతుడేమయ్యాడని చెలియతో కూడిన శివుడు నలుమూలలా కలియ చూస్తుండగా, అంతలోనే చెంతలో వసంతశోభతో శ్రీమంతమైన ఒక వనం. అందున ఏకాంతంలో బంతితో ఆడుతూ గంతులేస్తూ కవ్వింతలు పెట్టే ఒక ఇంతి- కాంతారత్నం కనిపించింది. మునుపే మగువను మరిగి- వలపుతో మేనులో సగమైన మగవాడు (అర్ధనారీశ్వరుడు) మహేశుడు! ఎదమీది పయ్యెద జారిజారి పడుతున్న ఆ జవరాలిని, ఒయ్యారిని రెప్పవెయ్యకుండా మైమరచి చూచాడు మదనారి. చిత్తం కాంతాయత్తమై మెత్తబడిపోయింది. ‘కన్నులకు విందు చేసే ఈ అన్నులమిన్న ఎవ్వరిదో కదా! ఈ సజీవ శిల్పసుందరిని నేను ఏ కల్పంలోనూ కనలేదు. మంద గమనంతో డెందానికి అమంద ఆనందం గొలిపే ఈ ఇందువదన అందం అరవింద భవుని (బ్రహ్మగారి) సృష్టి మాత్రం కాదు. ఈ హేలావతి నా లీలా విహారాలకు ఏలాగున లభిస్తుందో!’ అని కోలాహల మనస్కుడయ్యాడు హాలాహలధరుడు శూలి…
ఆ॥ ‘వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
తరలి యెరుక లేక మరచె గుణంబుల
నాలి మరచె నిజ గణాలి మరచె’
రాజా! అందమైన ఆ వగలాడి వాడి చూపుల వేడికి తాళలేక విరూపాక్షుడు ధైర్యాన్ని- నిగ్రహాన్ని, నిబ్బరాన్ని పూర్తిగా కోల్పోయాడు. తన్ను తాను మరచాడు. కట్టుకొన్న ఇల్లాలిని, అంటిపెట్టుకు తిరిగే ప్రమథ గణాలనూ మరచాడు కపాలి. గాలి తాకిడికి ముడి ఊడిపోగా ఆ వన్నెలాడి సన్నని చీర జారిపోయింది. ఆమె కొప్పుముడి వీడి వ్రేలాడుతోంది. సిగ్గుతో నవ్వుతూ మోహిని చెట్టుమాటున దాగింది. కామారి మనసు కంపించింది. మంగళగౌరి సమక్షంలోనే ముక్కంటి ఆ వాల్గంటి ఒంటి మీద చెయ్యి వెయ్యడానికి వెంటపడ్డాడు. వేగిరపాటుతో వాటేసుకోబోయాడు. ఆ పూబోడి పట్టు వదిలించుకొని పారిపోతుండగా.. మదనుడు అదను చూసి కదనరంగంలో ముదమారగ మదనారిని (శివుడిని) మరలా జయించాడా అన్నట్లు, కరిణిని వెంటాడే మదకరీంద్రుని వలె మన్మథారి (హరుడు) మోహినిని వెంబడించాడు. రాజా! ఆశుతోషుని (శివుని) అమోఘ వీర్యం అవని (నేల) మీదపడ్డది. అది పడిన చోటంతా అపరంజి (పసిడి)గాను, వెండిగాను పరిణమించింది! తరువాత త్రిలోచనుడు తనను తాను తెలుసుకున్నాడు. మహానుభావుడైన ఆ మహాదేవుడు తన మహిమాతిశయంచే మాధవుని మాయ వలన కలిగిన స్వరూప విస్మృతి- మైమరపును గమనించి వెనుదిరిగాడు. పురుషోత్తముడు కూడా ప్రమదారూపాన్ని పరిత్యజించి పురుష రూపం పొందాడు.
‘క్షీరసాగర మథనం’ నామకమైన మూల ఘట్టానికి అనుబంధంగా ‘మాధవుడు మోహినీరూపంచే మహాదేవుని మోహింపజేయుట’ అన్న ఈ అవాంతర ప్రసంగానికి అమాత్యుడు పోతన అమూలకమైన ఈ క్రింది ‘ఆటవెలది’లో కటువైన జీవిత సత్యాన్ని పటుతరం (సమర్థం)గా, ఇంపైన ఈ ముక్తాయింపు మాటగా ఎలా తేట పరచాడో తిలకించండి..
ఆ॥ ‘కాముగెలవ వచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయము గలిగి మెరయవచ్చు
నాఁడువారి చూపుటంపర గెలువంగ
వశముగాదు త్రిపురవైరి కైన’
‘మన్మథుని గెలవవచ్చు. యముని ధిక్కరించవచ్చు. మృత్యువును జయించి మిక్కిలి ప్రకాశించవచ్చు. కాని, కామినుల- ఆడువారి వాలు చూపుల వాడి తూపు (బాణా)లను గెలవడం త్రిపురారి అయిన పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు కదా!’ శుక ఉవాచ- రాజా! హరి శివునితో.. ‘గిరీశా! మహేశా! నా మాయలో పడికూడా మోసపోకుండా తెలుసుకొని ఈ తీరున తేరుకొన్న వాడవు- ఓ త్య్రంబకా! సృష్టిలో నీవు తప్ప మరో ధీరుడు లేడయ్యా!’ అంటూ అతనిని ఎంతో ఆదరించి, అక్కున చేర్చుకొన్నాడు.
పురాణాలలోని ఇటువంటి విచిత్ర వృత్తాంతాల పరమార్థం తెలుసుకోలేకపోతే అపార్థానికి లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ‘మహాదేవుడు అంతటి వాడే మోహానికి గురైనప్పుడు మామూలు జీవులకు అది దోషమెలా అవుతుంది’ అని భ్రాంతిలోపడే ప్రమాదం ఉంది. ‘మమ మాయా దురత్యయా’ (గీత)- దాట శక్యం కాని హరిమాయ వల్ల పాటవం కల్గిన- సర్వ సమర్థుడైన, సర్వజ్ఞుడు, స్మరహరుని (మదన దహనుని)కి, శర్వునికే చేటు కలిగితే, (పాశబద్ధస్తదా జీవః పాశముక్త స్సదాశివః) పాశబద్ధులమై, సర్వవిధాలా అశక్తులమైన మనం పోటుగాళ్లమా? పాశముక్తుడైన ధూర్జటి (శివుని)కి దీటుకాగల వారమా? దీనిని బట్టి మనం ఎంత సావధానంగా, సతర్కంగా, జాగ్రత్తగా ఉండాలో గ్రహించాలి!
భాగవతం తృతీయ స్కంధంలో కపిలుడు తల్లి దేవహూతితో అంటాడు- ‘అమ్మా! నా మాయయే స్త్రీ రూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. కాన, పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి పారమార్థిక యోగమార్గంలో సంచరించాలి.’ వైష్ణవమైన భాగవత పురాణానికి నారాయణ భగవానుడే ప్రతిపాద్య దైవం. విష్ణు పారమ్యానికే- పరాయణత్వానికే ప్రాధాన్యం! ఇతర దేవతలందరూ ఆయన కన్నా కనిష్ఠులే. అందుకే, మాయా గోవిందుని (మోహిని) కందుక (బంతి) క్రీడను చూసి ఇందుశేఖరుని (శివుని) మనస్సు కూడా మరులుగొని చిందులు వేయడం, ఆమె పొందుకై పరితపించడం, ఆపై బిందు (వీర్య) పతనం ఇందు వర్ణితమయ్యాయి! వాస్తవానికి తాత్తికంగా శివకేశవులకు భేదమే లేదు. పారమార్థికంగా, మాధవుని మోహినీ అవతారం ఎలా లీలామాత్రమో, అలాగే మహాదేవుడు మోహగ్రస్తుడు కావడం కూడా కేవలం లీలే! లోక సంగ్రహం- శిక్షణే, లీలా ప్రయోజనం. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006