తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో స్వామివారి సర్వదర్శనం ( Sarva Darsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకోగా 17,689 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.20 కోట్లు వచ్చాయని తెలిపారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు (TTD Chairman), ఈవో జె శ్యామలరావు ఆలయంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఉగాది (Ugadi) , ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని వివరించారు.