Bathukamma | ఏ దేవుడినైనా మనం పూలతో పూజిస్తాం. కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ. దేవీ నవరాత్రులలో జ్ఞానపదులు శిష్టాచారంతో అమ్మను పూజిస్తే.. జానపదులు పసుపుతో గౌరినిచేసి మొక్కే తత్త్వమే బతుకమ్మ. చేను చెలకల్లో, గుట్టల్లో పూసే గునుగు, తంగేడు, అడవి చేమంతి, కట్లపూలు, ముత్యాల పూలు, గడ్డిపూలు మొదలైన అడవి పూలకు చేసే అర్చనే.. బతుకమ్మ పండుగ.
బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూలపండుగ. భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుక జరుపుకొంటారు. అమావాస్య రోజున పెత్రామాస, చిన్న బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ.. ఇలా వివిధ పేర్లతో మొదటి రోజు చిన్న బతుకమ్మ ప్రారంభమవుతుంది. తదుపరి అష్టమి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో పూర్తి అవుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ పితృపక్షాలలో వస్తుంది. అమావాస్య నాడు తమ పితృ దేవతలు వచ్చి, ఎంగిలిపడి వెళ్తారని, అందువల్ల్లే ఈ పండుగను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని పెద్దల మాట. కోడళ్లు అత్తవారింట ఈ పండుగ చేసుకొంటారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రతీ ఆడపిల్ల తన పుట్టింట అక్కా చెల్లెళ్లు, చిన్ననాటి స్నేహితులతో ఈ పండుగ జరుపుకొంటుంది. గాజుల గలగలలు, పట్టుచీరల రెపరెపలు, ఆభరణాల అందాలు, పూల సుగంధాలు, ఎటు చూసినా ఇంతుల అందాలు హరివిల్లులా పల్లె అందాన్ని ఇనుమడిస్తాయి. పూర్వం నుంచీ ఉన్న సంప్రదాయం ఇది. కాకతీయులు తమ కులదేవత ముంగిట గుమ్మడి పూలతో పూజించేవారట. బతుకమ్మ చోళుల కాలంలోనూ ఉండేది అనడానికి ‘ధర్మంగుడను రాజు..’ పాటే సాక్ష్యం.
తరాల బతుకమ్మ
వరుసలు వరుసలుగా పూలను పేరుస్తూ, వలయాకారపు మేరువులా తీరుస్తూ, ఆ పైన పసుపు గౌరమ్మను ఉంచడమే బతుకమ్మ. తదుపరి, ఇంటి కూరాడుకు నమస్కరించడం ఆచారం. ఇక్కడి సంప్రదాయంలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని రెండు బతుకమ్మలను పేర్చడం ఆనవాయితీ. స్త్రీలోని మాతృత్వ కోణం ఇందులో పుష్కలంగా కనిపిస్తుంది. సాయంత్రం అంతా కలిసి చెరువు ఒడ్డునో, కుంట దగ్గరో.. బతుకమ్మ ఆడుతారు.
అందమైన ఆట
చక్కగా ఓ పెద్ద ముత్తయిదువ వెంపలి కొమ్మను మధ్యలో పెట్టి, పసుపు కుంకుమలతో ఆ మొక్కను సతీదేవిగా తలచి పూజిస్తుంది. తదుపరి, ఆ పేర్చిన బతుకమ్మలకు సద్ది సద్దులను పెడతారు. అందరూ వలయాకారంగా చప్పట్లు చరుస్తూ, పాట పాడుతూ తిరుగుతారు. అమ్మ గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ జానపదలు పాట.. ఓ గళార్చన, ఓ ప్రదక్షిణ! ఇన్ని ప్రక్రియలతో పండుగ సాగుతుంది. పాటలొచ్చినవారు పాడుతుంటే, మిగిలినవారు అనుసరిస్తూ ఆడుతారు. ఈ పాటల్లో ఎదిగిన బిడ్డలకు ఎన్నో సుద్దులు, బుద్దులు ఉంటాయి. గౌరీదేవిని తమ బిడ్డగా తలచి పాటలు పాడి నీళ్లలో కలుపుతారు. చివరి రోజున ‘పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ, వచ్చే సంవత్సరంలో మళ్లీ రావమ్మ’ అంటూ ఆ తల్లిని సాగనంపుతారు. బతుకమ్మ పాటలో పురాణ కథలు, చారిత్రక గాథలు, సామాజిక సమస్యలు.. అన్నీ పదాలై ప్రవహిస్తాయి. ఇలా, గంటలకొద్దీ ఆడేవారు మన పెద్దలు. ఇన్ని రకాల పూల చుట్టూ ఓ రెండు గంటలు ఆడిపాడితే.. సంవత్సర కాలం నడుము నొప్పులు, కాళ్ల నొప్పులు మన దగ్గరికే రావు.
1. పేర్చడంలో ఆధ్యాత్మికత
2. పూలలో ఆయుర్వేదం
3. పాడే పాటల్లో బతుకుపై అవగాహన
4. ఆడే ఆటల్లో సామాజిక స్పృహ,ఆరోగ్యతత్త్వం
..అన్నీ కలిసి ఆడపిల్లలకు పుట్టింటి బంధం, మగపిల్లలకు తోబుట్టువు అనుబంధం గొప్పతనాన్ని చాటిచెబుతాయి. కుప్పబోసి చూస్తే, అందాల బతుకమ్మ బతుకునిచ్చే అమ్మగా, బతుకమ్మగా నిలుస్తుంది.
..ఇన్ని మంచి గుణాలున్న పండుగ కాలంతో పాటు మార్పులు చెందుతూ, అస్తిత్వానికి కొంత దూరమవుతున్నదనే ఆవేదన కూడా వ్యక్తం అవుతున్నది. ఆట మారింది. పాట డీజేలలో మాత్రమే వినిపిస్తున్నది. ఆహార్యంలో వింత పోకడ కనిపిస్తున్నది. ఆడుతూ, పాడుతూ, చుట్టూతా తిరుగుతూ అమ్మను ఆరాధిస్తూ, ఈ ప్రకృతే పరమాత్మ అని తలుస్తూ.. మన అస్తిత్వం, చిహ్నం అనుకున్న మన పండుగ రూపురేఖలు మారకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, ఆ అడవి పూల మధ్య ఆనందిద్దాం! అమ్మను కొలుద్దాం! పూలను అర్చిద్దాం. పాటను ప్రేమిద్దాం.
జై బతుకమ్మ, జై జై తెలంగాణ!
…?డా. భేరి సునీత రాంమోహన్ రెడ్డి