ఒకరి తప్పును పెద్దమనసు చేసుకుని క్షమించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు! అలాగని అసంభవం, అసాధ్యం అంతకన్నా కాదు! తమ మిత్రులతో స్నేహం చెడిందంటే నెలల తరబడి మాట్లాడరు. ఒక్కోసారి సంవత్సరాల తరబడి ముఖాలు చూసుకోరు. కాస్త శ్రద్ధ చూపితే మనసుకు అయిన గాయం కూడా త్వరగానే మానుతుంది. గుండెల్లో గూడుకట్టుకున్న కల్మషాల మురికిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఎంతటి వారినైనా క్షమించే విశాల హృదయం పెంపొందించుకోవాలి. మన హృదయాలను, మన పాపాలను కడిగేసే ఓ అతిథి మన ఇంటికి రాబోతున్నాడు. ఆ అతిథి మనకు నిగ్రహం నేర్పుతాడు. ఆగ్రహంపై అదుపు సాధించడం ఎలాగో చెబుతాడు. ఆకలిని అణగదొక్కడం ఎలాగో వివరిస్తాడు.
మనపై మనం అదుపు సాధించడమెలాగో తర్ఫీదునిస్తాడు. ఆ అతిథి కోసం కోట్లాది మంది ముస్లింలు నెల రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆ అపూర్వ అతిథిని స్వాగతించేందుకు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు వరాల వసంతం.. శుభాల మాసం.. పవిత్ర రమజాన్. ఆకాశంలో రమజాన్ నెలవంక కనిపించగానే కోట్లాది ముస్లింల మోములు మెరిసిపోతాయి.
గుండెల్లో ప్రేమ ఉప్పొంగుతుంది. కల్మషాలన్నీ కడిగేసుకుంటారు. ‘భాయి..భాయి’ అని ఒకరినొకరు హృదయాలకు హత్తుకుంటారు. ప్రేమ, దయ, కారుణ్యం పొంగుతాయి. ఒకరిపట్ల ఒకరికి సానుభూతి అలవడుతుంది. నెలరోజుల ఉపవాసాలకు సంసిద్ధులవుతారు. బద్ధ విరోధులను సైతం ప్రేమించే తర్ఫీదు ఈ ఉపవాసాలు నేర్పుతాయి. సహెరీ, ఇఫ్తార్ సందళ్లు ప్రేమ, ఆప్యాయతలకు వేదికలవుతాయి.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076