కఠోర ఉపవాసాలు.. ఉదారంగా చేసే దానాలు.. పఠించే నమాజులు.. ఆచరించే నియమాలు.. అన్నిటి సమాహారం రంజాన్ మాసం. నియమబద్ధంగా గడిపిన నెల రోజుల దీక్ష రంజాన్ పండుగతో పరిపూర్ణం అవుతుంది. వ్యసనాలనుత్యజించి, ఆకలి దప్పికలను సహించి అల్లాహ్ మెప్పు పొందే అద్భుత క్షణం ఈదుల్ ఫిత్.్ర ఇస్లాం సమాజం ఘనంగా జరుపుకొనే రంజాన్ పండుగ అందించే సందేశమిది…
నెలరోజుల పాటు రోజంతా పస్తులు ఉండి చేసిన కఠోర దీక్షలు.. రాత్రుళ్లు గంటల తరబడి ప్రభువు ముందు చేసిన తరావీహ్ నమాజులు.. ఉన్నదాంట్లో బీదసాదలకు చేసిన దానాలు.. వీటన్నిటి ప్రతిఫలం లభించే రోజే ‘ఈదుల్ ఫిత్’్ర. రంజాన్ మాసంలో నియమ నిష్ఠలతో దైవదూతలా జీవితం గడిపిన వారే పండుగ శుభాలకు అర్హులని ప్రవక్త బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈద్ రోజు ఇలాంటి విశ్వాసులు ఈద్గాహ్కు వెళుతుంటే స్వర్గలోకాల నుంచి దైవదూతలు దిగివచ్చి స్వాగతం పలుకుతారట. అత్యంత ప్రేమ, ఆప్యాయతలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతారట.
‘ఓ అల్లాహ్ ప్రియదాసులారా! పదండి; మీరు పాటించిన ఉపవాసాలకు, రాత్రుళ్లు దైవారాధనలో నిల్చున్నందుకు, నెల సాంతం ప్రభువు విధేయతను చాటుకునేందుకు మీరు పడిన శ్రమకు ఈ రోజు మీకు బహుమానం దక్కుతుంది. ఇది మిమ్మల్ని సత్కరించే రోజు. మీ పాపాలను మన్నించి మిమ్మల్ని ప్రక్షాళనం చేసే రోజు’ అని దైవదూతలు ఈద్గాహ్ వైపునకు వెళుతున్నంత సేపూ విశ్వాసులకు ఘనస్వాగతం పలుకుతారు. ‘ఈ రోజు మీరు కోరుకున్నదల్లా ప్రసాదిస్తాను. మీరు నా పట్ల అలక్ష్యం, అవిధేయత చూపనంతకాలం నేను మీకు అనంతమైన అనుగ్రహ భాగ్యాలు అనుగ్రహిస్తాను’ అని ఈద్ రోజున అల్లాహ్ ప్రకటన చేస్తాడు.
‘మీరు నన్ను ప్రసన్నం చేసుకోవడంలో సఫలమయ్యారు. మీ ప్రయత్నాలన్నీ నాకెంతగానో నచ్చాయి. ఈరోజు నేను మీతో పూర్తిగా ప్రసన్నుడనయ్యాను’ అనే శుభవార్త ఈద్ రోజు ప్రకటిస్త్తాడు. రంజాన్ పరమార్థాన్ని, రోజా ఉద్దేశాలను గ్రహించి రంజాన్ నెలను నియమబద్ధంగా గడిపిన వారికే ఈ శుభవార్త అని ప్రవక్త (స) చెప్పారు.
ఫిత్రా చెల్లింపు స్తోమత కలిగిన వారు తప్పనిసరిగా నెరవేర్చవలసిన బాధ్యత. ఇది నిరుపేదల హక్కుగా భావించి దానం చేయాలి. రంజాన్ రోజాలు పాటించినవారే కాదు, పాటించలేకపోయినవారు సైతం తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఫిత్రా దానం చేయాలి. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది తరఫున ఫిత్రా చెల్లించాలి. సుమారు పావు తక్కువ రెండు కిలోలు గోధుమలు కానీ లేక వాటికి సమానమైన ఖరీదుగల ఇతర ధాన్యం కానీ, డబ్బులు కానీ పేదలకు ఇవ్వాలి. ఈద్ నమాజు కంటే ముందు ఫిత్రా దానం చేయాల్సి ఉంటుంది. పండుగ సంతోషాల్లో నిరుపేదలూ పాలుపంచుకోవాలన్నది ఫిత్రా ఉద్దేశం.
రంజాన్ నెలను అలక్ష్యంగా, మనోవాంఛలను త్యజించకుండా మొక్కుబడిగా గడిపిన వారు ఈద్ శుభాలకు నోచుకోలేరన్నది ప్రవక్త ఉద్బోధ. చిల్లులు పడిన పాత్రతో నీటిని నింపడం సాధ్యమా? అలానే ఆంతర్యానికి పడ్డ మనోవాంఛలనే చిల్లులను మరమ్మతు చేసుకోకుండా చేసే దైవారాధనలైనా, ఉపవాసాలైనా బూడిదలో పోసిన పన్నీరవుతాయని ఖురాన్ పండితుల ఉద్బోధ. ‘ఒక వ్యక్తి తిన్నంతనే వాంతి చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఆ ఆహారం ఎలాంటి ప్రయోజనాన్ని, శక్తినీ కలిగించలేదు. అలాగే రంజాన్ నెలరోజుల ఉపవాసాల పరమార్థాన్ని పండుగ మరుక్షణమే త్యజిస్తే… ఆ నెల రోజుల శిక్షణ ఎలాంటి లాభమూ కలిగించదు’ అంటారు ప్రముఖ ఇస్లామిక్ తత్వవేత్త మౌలానా మౌదూది. రంజాన్ పరమార్థాన్ని ఒంటపట్టించుకున్న వారే ఈద్ కానుకకు అర్హులని అల్లాహ్ శుభవార్త.
ఖలీఫా హజ్రత్ ఉమర్ (రజి) పండుగ పూట సంబురాలు చేసుకునే బదులు తీవ్రంగా రోదించేవారట. ఉపవాసాలు, చేసిన దానధర్మాలు, నెలరోజుల పాటు చేసిన దైవారాధనలు అల్లాహ్ స్వీకృతిని పొందాయో లేదోనన్న ఆందోళనతో వెక్కివెక్కి ఏడ్చేవారట. ఉపవాసాల ఉద్దేశమైన ‘తఖ్వా’ దైవభీతి పెంపొందకపోతే ఉపవాసాలన్నీ వ్యర్థమైపోతాయి. ఎవరికైతే తఖ్వా దొరికిందో గొప్ప అనుగ్రహాన్ని, ఎనలేని విజ్ఞతను పొందినవారవుతారు. ‘దారికి ఇరువైపులా ముళ్లకంప ఉందనుకోండి! అలాంటి సమయంలో శరీరంపై ఉన్న వస్ర్తాన్ని ఆ ముళ్లలో చిక్కుకోకుండా మన దుస్తులను దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా ముందుకెళ్లడమే తఖ్వా’ అంటారు హజ్రత్ ఉమర్ (రజి). తళుకుబెళుకుల ఈ మాయా ప్రపంచంలో మనోవాంఛలు గుర్రాల్లా పరుగెడుతాయి. వాటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే దైవభీతి అని ఆయన పేర్కొన్నారు.
‘స్వర్గం రెండు అడుగుల దూరంలో ఉంది. ఒక అడుగు మనోకాంక్షలపై పెట్టు, రెండో అడుగు స్వర్గంలోనే ఉంటుంది’ అని ప్రవక్త ఉద్బోధించారు. మనోకాంక్షలను కట్టడిచేయడానికి వచ్చిన రంజాన్ శిక్షణను ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నామో ఈ పండుగ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సముద్రంలో పడవ నీళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ చుక్కనీరును లోనికి రానివ్వదు. నీళ్లలో పడవ ప్రయాణిస్తున్నంతసేపూ ఆ ప్రయాణం సాఫీగా సాగుతుంది. పడవలో చేరితే ప్రాణాంతకమే. అలాగే మీరు ప్రపంచంలో ఉండండి. కానీ మీలోకి ప్రపంచాన్ని దరిచేరనివ్వకండి’ అని అంటారు సూఫీలు. ప్రపంచమే సర్వస్వంగా ప్రేమించేవారి హృదయాల్లో దైవభీతి స్థానంలేదు. ఇలాంటి వారు చేసే సజ్దాలు, నమాజులు, ఉపవాసాలు మొక్కుబడిగా సాగుతాయి. ప్రపంచంలో ఒక బాటసారిలా జీవితాన్ని గడపాలన్నది ప్రవక్త ఉద్బోధ.
‘ఫిత్’్ర అంటే ఉపవాస వ్రతాలను విరమించడం. రంజాన్ ఉపవాసాలను పూర్తిచేసిన సందర్భంగా స్తోమత కలిగిన ప్రతీ ముస్లిమ్ పురుషుడు, స్త్రీ సంతోషంగా పేదలకు కొంత దానాన్ని అందజేయవలసి ఉంటుంది. రంజాన్ పండుగకు ముందు చేసే దానాన్ని ఫిత్రా దానం అంటారు. ఇది పాపాల పరిహారంగా ఉపయోగపడుతుంది. ‘ఉపవాస వ్రత సమయంలో పొరపాటున మన నోట పనికిమాలిన మాటలు వెలువడవచ్చు. అదీగాక అనాలోచితంగా, అసంకల్పితంగా మన హృదయంలో చెడు తలంపులు కూడా వస్తుంటాయి. అందువల్ల దైవ ప్రవక్త (స) ఫిత్రా దానాన్ని (మనకు) విధిగా నిర్ణయించారు. ఫిత్రా దానం వల్ల ఉపవాసాలు పరిశుద్ధమవుతాయి. వేరొకవైపు ఈ దానం వల్ల పేదవాళ్లకు కూడు, గుడ్డ లాంటి ప్రాథమిక అవసరాలు నెరవేరుతాయి’ అని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రజి) ఫిత్రా ప్రాముఖ్యాన్ని వివరించారు.
రంజాన్ నెల రోజులూ ఉపవాసాలు పాటించాం, దైవారాధనలు చేశాం, జకాత్, సదకా, ఫిత్రాల ద్వారా పేదలను ఆదుకున్నాం. ప్రేమ, సహనం, సానుభూతితో పరస్పరం మెలిగాం. ఒకరి తప్పులను మరొకరు పెద్దమనసుతో మన్నించుకున్నాం. అబద్ధం, అవినీతి, చెడుచూపు, వ్యర్థ ప్రేలాపనలన్నిటినీ త్యజించాం. నెల రోజులపాటు మంచి సాంగత్యంలో జీవితం గడిపాం. మంచికి మారుపేరుగా నిలిచాం. ఈద్ తర్వాత కూడా ఇదే కొనసాగిస్తేనే రంజాన్ శిక్షణకు సార్థకత ఏర్పడుతుంది. రంజాన్ మాసంలోనే నమాజులు చేసినవారు మిగతా 11 నెలలూ ఐదు పూటలా నమాజ్ చేయాలనే సంకల్పం చేసుకోవాలి. బతికున్నంత కాలం నమాజ్‌ను వీడనని ప్రతిజ్ఞ చేసుకోవాలి. రంజాన్‌లో జకాత్ దానాలు చేసిన వారు మిగతా రోజుల్లోనూ దానధర్మాలను కొనసాగించాలి. సంపదలో నుంచి జకాత్ దానాన్ని పేదలకు పంచిపెట్టే ప్రేరణను కొనసాగించాలి. రంజాన్‌లో ఏవిధంగానైతే మోసం, దగా, అబద్ధం, వాగ్దాన భంగం, కల్తీకి పాల్పడటం, లంచం, అవినీతి లాంటి చెడు గుణాలను త్యజించారో.. జీవితంలో ఎప్పుడూ వాటి జోలికి వెళ్లబోమని గట్టి సంకల్పం చేసుకోవాలి. మొత్తంగా ఈ రంజాన్ మాసంలో శ్రీకారం చుట్టిన మంచిపనులను జీవితాంతం ఆచరిద్దాం.
-ముహమ్మద్ ముజాహిద్ 96406 22076