TTD | ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడని టీటీడీ పేర్కొంది. అలాగే అదే రోజున తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నట్లు తెలిపింది. పురాణాల మేరకు తిరుమలలో 3.50కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయి. వీటిలో సప్త తీర్థాలు ప్రముఖమైనవి.
ఇందులో పుష్కరిణి తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం ముఖ్యమైనవి. ఆయా తీర్థాల్లో భక్తులు స్నానాలు చేస్తే ముక్తిమార్గం పొందుతారని ఆర్యోక్తి. అయితే, శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మాఘమాసం రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో ఉన్న ఈ తీర్థానికి పౌర్ణమి రోజున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. పున్నమి రోజున ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రితో తీర్థం వద్దకు వెళ్లి రామకృష్ణ తీర్థంలో వెలిసిన రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.