Garuda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కనుల పండువలా జరిగింది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమై.. రాత్రి వరకు కొనసాగింది. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంగళనీరాజనాలు పలికారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనసేవన అతి కీలకమైనదిగా భావిస్తారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
