Pitru Paksham | వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. నేటి పితృపక్షాలు ప్రారంభంకానున్నాయి. పితృ పక్షాల సమయంలో రెండు ఖగోళ ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరుగుతున్నది. ఈ సారి పితృపక్షాలు గ్రహణంతో మొదలై గ్రహణంతోనే ముగియనున్నాయి. నేడు చంద్రగ్రహణంతో ఏర్పడనునండగా.. ఈ నెల 21న సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ పితృపక్షాల సమయంలో తమ పూర్వీకుల ఆశీస్సుల కోసం వారిని సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం. వాని ఆశీర్వాదం కోసం ఏం చేయాలి.. ఎలాంటి పూజలు చేయాలో ఓసారి తెలుసుకుందాం..!
పితృపక్షాలు ఏటా పక్షం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆయా వంశానికి చెందిన పూర్వీకులకు కుటుంబీకులు నివాళి అర్పించేందుకు, శ్రాద్ధ కర్మలను నిర్వహించి తర్పణాలు ఇస్తారు. ఈ సంవత్సరం పితృ పక్షాలు సెప్టెంబర్ 7 నుంచి మొదలై సెప్టెంబర్ 21తో ముగుస్తాయి. భాద్రపద శుక్ల పౌర్ణమి నుంచి అశ్వినీ కృష్ణ అమావాస్య అంటే మహాలయ అమావాస్యతో పూర్తవుతాయన్నమాట. ఈ పక్షం రోజుల్లో కాలంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి ఆయా వంశీకులు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు చేస్తారు. ఈ సమయంలో పితృదేవతలను సంతృప్తి పరచడంతో పాటు ఇంట్లో ప్రతికూలతలను తొలగించేందుకు తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
పితృపక్షాలు ప్రారంభానికి ముందు ఇంటిని శుద్ధి చేసుకోవాలని శాస్త్రం చెబుతున్నది. పరిశ్రుభంగా ఉన్న ఇంట్లో పితృదేవతల శక్తి ప్రసారానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. మురికిగా.. ఎక్కడికక్కడే పడేసిన ఇంట్లో ప్రతికూల శక్తులుంటాయి. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అయితే, ఇంటి నైరుతి మూలను పితృస్థానంగా పండితులు చెబుతున్నారు. ఈ దిశలో పితృదేవతలు కొలువుంటారని నమ్మకం. పితృదేవతల ఆశీస్సుల కోసం.. వారిని శాంతింప జేసేందుకు ప్రతిరోజూ సాయంత్రం ఈ దిశలో ఓ దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలుంటాయి. పితృదేవతలను స్మరిస్తూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి.
ఈ పితృపక్షాల సమయంలో శ్రాద్ధం, తర్పణ ఆచారాలను నిర్వహించే సమయంలో తప్పనిసరిగా అది దక్షిణాభిముఖంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. దక్షిణం వైపు ఈ 15రోజులు పొరపాటున సైతం కాళ్లు ఉంచి పడుకోకూడదని చెబుతున్నారు. పితృపక్షాల సమయంలో ఆవులు, కాకులు, కుక్కలకు ఆహారం పెట్టాలి. ఆయా జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం పితృకార్యాల్లో ఒకటని పండితులు చెబుతున్నారు. ఈ పక్షకాలం పాటు ఇంట్లో వండిన ఆహారంలో కొంత తప్పకుండా కాకులు, కుక్కలకు తప్పకుండా పెట్టాలని సూచిస్తున్నారు. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం వారి జ్ఞాపకార్థం ఏదైనా సేవా కార్యక్రమాలు చేయవచ్చని చెబుతున్నారు.
అలాగే, పెద్దలను గుర్తు చేసుకుంటూ వారి శ్రేయస్సు కోసం పేదలు, బ్రాహ్మణులకు, అవసరంలో ఉన్నవారికి వీలైనంత దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీలైతే ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో పితరుల ఆత్మశాంతి కోసం తర్పణాలు వదలాలి. చాలా మంది పూర్వీకుల గౌరవార్థం ఇంట్లో, ఏదైనా పుణ్యక్షేత్రంలో తప్పకుండా పిండప్రధానాలు చేయడం ఉత్తమం. అయితే, మరికొందరు ఇంట్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తుంటారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలను తృప్తి పరిచేందుకు పలు పద్ధతులను శాస్త్రాలు సూచించాయి. ఇందులో మీకు అనువైన వాటిని ఎంచుకొని ఆచరిస్తే పూర్వీకుల ఆశీర్వాదం తప్పక లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.
Read More :
Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. సెప్టెంబర్ 07నుంచి 13 వరకు