Tirumala Temple | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. రాత్రి చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే. కుమార పౌర్ణమి శనివారం రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటలకు మొదలై.. 2.22 గంటల వరకు ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయ ద్వారాలను రాత్రి 7.05 గంటలకు మూసివేశారు. గ్రహణ సమయానికి 6గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
తెల్లవారు జామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి.. ఆలయ ద్వారాలను తెరువనున్నారు. గ్రహణం నేపథ్యంలో 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శనాలను నిలిపివేసింది. అలాగే తిరుచారు పద్మావతి ఆలయాన్ని సైతం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు.
ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరువనున్నారు. శుద్ధి తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పించనున్నారు. అలాగే గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను సైతం మూసివేశారు. గ్రహణం సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం మూసివేయగా.. ఆదివారం శుద్ధి తర్వాత 9 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు వివరించారు. అలాగే శ్రీశైలం, సింహాచలం ఆలయాలు ద్వారాలను మూసివేశారు.