పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు జకాత్‌ను విధిగా ఆచరించాలి. జకాత్ అంటే తమ ఏడాది సంపాదనలో రెండున్నర శాతాన్ని నిరుపేదలకోసం ఖర్చు పెట్టడం. జకాత్ అంటే పవిత్రత, పరిశుద్ధత అని కూడా అర్థం. నమాజ్లాగా జకాత్ కూడా విధిగా ఆచరించాల్సిన ధర్మం. దీని ద్వారా చేసే దైవారాధన అత్యుత్తమమైనది. జకాత్ ద్వారా సంపన్నుల నుంచి వసూలు చేసిన ధనం నిరుపేదలకు చేరుతుంది. సత్యాన్ని విశ్వసించి, జకాత్ విధిని నెరవేర్చేవారికి ఎలాంటి దుఃఖం, భయం ఉండవని ఖురాన్ ప్రవచిస్తున్నది. ఆర్థిక స్తోమత కలిగిన ముస్లింలు తమ సంపద నుంచి విధిగా జకాత్ తీసి ఇస్లామీయ ప్రభుత్వానికి చెల్లించాలి. అలాంటి ప్రభుత్వం లేని చోట విధిగా వ్యక్తిగతంగా గానీ, సంఘం ద్వారా గానీ అర్హులైన వారికి దానాలు చేయాలి. ముస్లింల ప్రాపంచిక వ్యామోహాన్ని నిర్మూలించి, వారి హృదయాల్లో దైవ ప్రేమను మొలకెత్తించేందుకు జకాత్‌ను ఏర్పాటుచేశారు. సమాజంలో ప్రజలందరికీ ఆర్థిక న్యాయాన్ని చేకూర్చాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం.
మనుషుల మనుగడ కోసం అల్లాహ్ అనేక సంపదలను ప్రసాదించాడు. అందుకు గాను అల్లాహ్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనకు ఇచ్చిన సంపదల్లో కొంతభాగం పేదలైన తోటి మానవులకు అందించాలి. ధాన్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు.. ఇలా భూమిలో పండే పదార్థాలతో పాటు ధన, కనక, వస్తు, వాహన, వస్త్ర, వంట సామగ్రి ఉత్పత్తులను దానం చేయాలి. ఈ నేపథ్యంలో మన సంపదను జకాత్ ద్వారా సద్వినియోగం చేస్తేనే మనం దైవ ప్రసన్నతను పొందుతాం. జకాత్ వల్ల మనలో స్వార్థం, లోభం, అసూయ, ద్వేషం, దోపిడి లాంటి చెడు గుణాల నిర్మూలన జరుగుతుంది. ప్రేమ, పరోపకారం, త్యాగం, సానుభూతి, సహకారం, స్నేహం, చిత్తశుద్ధి, ఔదార్యం లాంటి సద్గుణాలు పెంపొందుతాయి. జకాత్ ఇస్లాం సౌధానికి మూల స్తంభం. ఇది ఒక ధన సంబంధమైన దైవారాధన!
జకాత్ ఇవ్వడానికి కొన్ని షరతులు, విధి విధానాలను ఏర్పరిచారు. జకాత్ ఇచ్చే వ్యక్తి వయోజనుడై ఉండాలి. కనీస సంపదలు కలిగిన ధనవంతుడై ఉండాలి. సంపద లభించిన ఏడాది తర్వాత దానం చేయాలి. జకాత్ చేసేవారు అప్పులు చేసి ఉండకూడదు.
స్థిరాస్తులు, భూములు, నవరత్నాలు, యంత్రాలను, సొంత అవసరాలకు వాడే వాహనాలను జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పెంపుడు పశువులను కూడా ఖురాన్లో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఉంటే జకాత్ ఇవ్వవచ్చు.
పంటల ఉత్పత్తుల్లో పది శాతం ‘ఉష్’్ర రూపంలో జకాత్ ఇవ్వాలి. అర్హులైన వారికి జకాత్ ఇస్తున్నప్పుడు జకాత్ ఇస్తున్నానని మనసులో సంకల్పించుకోవాలి. దానాన్ని స్వీకరించే వ్యక్తిని జకాత్ యజమానిగా భావించాలి.
ఆత్మాభిమానం కలిగిన నిరుపేదలు, ఫకీర్లు, జకాత్ వసూలు చేసే ఉద్యోగులు దానాన్ని స్వీకరించవచ్చు. బానిసల విముక్తి కోసం, అప్పులు ఉన్నవారిని రుణ విముక్తుల్ని చేయడం కోసం, నిర్ధనులైన బాటసారులను ఆదుకోవడానికి జకాత్ ధనాన్ని ఖర్చు పెట్టవచ్చు.
ధర్మ సంస్థాపన కోసం, ధర్మ ప్రచారం కోసం దైవ మార్గంలో చేసే పనులకు జకాత్ ఖర్చు చేయవచ్చు. సొంత పనులు చేయించుకొని వాటికి ప్రతిఫలంగా జకాత్ ఇవ్వకూడదు.
ఏడున్నర తులాల బంగారం లేదా దానికి తగ్గ విలువైన సంపద ఏడాదిపాటు నిల్వ ఉన్న ప్రతీ ధనవంతుడూ విధిగా జకాత్ చెల్లించాలని ఖురాన్ పేర్కొన్నది.
– ముహమ్మద్ ముజాహిద్96406 22076