యస్మాద్వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ
యన్మౌనం యోగిభిర్గమ్యం తద్భజేత్ సర్వదా బుధః॥
(తేజోబిందు ఉపనిషత్తు 1-20)
‘ఏ ఆత్మను చేరుకోలేక వాక్కులు, మనసుతో కూడ వెనుకకు మరలుతున్నవో, యోగులు పొంద దగిన మౌనమేదో, అటువంటి మౌనాన్ని పండితుడు అవలంబించాలి..’ అని పై శ్లోకానికి భావం. అటువంటి పరిపూర్ణమైన మౌనానికి ప్రతీకలైన మహానుభావులు రమణ మహర్షి. రమణుల మొదటి పేరు వెంకటరామన్. ఆత్మజ్ఞానం కోసం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కొడుకును వెతకడానికి బావగార్లయిన సుబ్బయ్యరు, నెల్లి అప్పయ్యరును తల్లి అళగమ్మ ప్రాధేయపడింది. వెంకటరామన్ ఓ నాటక కంపెనీలో చేరాడని విని అప్పయ్యరు త్రివేండ్రం వెళ్లి విచారిస్తే ఫలితం లేకపోయింది. తల్లి స్వయంగా వెళ్లి కొడుకు పోలికలు ఉన్న ఓ బాలుణ్ని చూసింది. పిలిచినా పలుకకుండా అతడు జనాల్లో కలిసిపోయాడు. ఆమె దుఃఖించింది. సుబ్బయ్యరు కర్మకాండలకు హాజరైన ఒకరు వెంకటరామన్ తిరువణ్నామలైలో మహాయోగిలాగా ఉన్నాడని చెప్పారు.
అప్పయ్యరు అక్కడికి వెళ్లాడు. ఒక మామిడి తోటలో వెంకటరామన్ కనిపించాడు. అక్కడ కొత్తవారిని రానీయడం లేదు. తన చిరునామా కాగితం మీద రాసి లోపలికి పంపించాడు. వెంకటరామన్ మౌనముద్రలో ఉండిపోయాడు. కనీసం ఆయన వంక చూడలేదు. అప్పయ్యరు ఎంతో ప్రయత్నం మీద వెంకటరామన్ను కలిసి ఏదో మాట్లాడినా వ్యర్థమే అయింది. అళగమ్మకు విషయం జాబు రాసి, తిరుగు ప్రయాణమయ్యాడు. అళగమ్మ తన పెద్దకొడుకైన నాగస్వామితో తిరువణ్నామలై చేరుకున్నది. కొడుకును గుర్తించింది.
ఆయన మౌనముద్రలోనే ఉన్నాడు. ఎంతో బతిమాలింది. ఇంటికి తిరిగి వచ్చేయమని ఏడ్చింది. ఆయన ఇవేం గమనించలేదు. దూరంగా వెళ్లిపోయాడు. పచ్చి అప్పపిల్లే అనే వ్యక్తి కాగితం పెన్సిలు స్వామికిచ్చి ‘ఏదైనా రాయండి‘ అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి ‘ప్రతి ప్రాణి తన ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవితం ఎలా జరగాల్సి ఉంటే అలాగే దేవుడు నిర్ణయిస్తాడు. మానవులు ఎంత ప్రయత్నించినా కాకూడనిది కానేరదు. కానున్నది కాకుండా పోదు. కర్మ అవశ్యం అనుభవించవలసినదే! కాబట్టి తిరిగిపోవడమే ఉత్తమం’ అని అందులో రాశారు. అలా ఆత్మజ్ఞానానికి పరిపూర్ణమైన మౌనమే శరణ్యమని చాటి చెప్పారు భగవాన్ రమణ మహర్షి.
– డా.వెలుదండ సత్యనారాయణ