శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాదు (నెల)కొనునట్లు కనికరించు. పన్నగ శయనా! నీవన్న మాటలు ఎన్నటికీ అసత్యాలు కావు. కన్నతల్లి పలుకులు కన్నియ- కుమార్తెకు అన్నివిధాల సమ్మతమే కదా! యౌవన మదంతో స్వైరిణి- వ్యభిచారిణియైన కామిని అన్య పురుషుని యందు ఆసక్త అయితే, జ్ఞానియైన మగడు- మహాపురుషుడు దానిని విడిచి వేస్తాడు. అజ్ఞానియైన కాపురుషుడు- దుశ్శీలుడు కాముకుడై ఆ అంటుకత్తె- జారిణిని విడువలేక ఇహపరాలకు రెంటికీ చెడిపోతాడు.
నీకు తెలియని ధర్మమేమున్నది నీరజాక్షా!’ ఇలా విన్నవించగా మిన్నగా (మిక్కిలి) ప్రసన్నుడైన వెన్నుడు వైదర్భితో ఇట్లన్నాడు- ఓ పువ్వుబోణీ! ఏదో నవ్వులాటకన్న మాటలకు నీవేల బేలవై ఇంతగా వంత- బాధపడుతున్నావు? వేటలో, పోటు (రణం)లో, రతీ సమయంలో సూటిపోటి మాటలు పలికినా, ఓ కప్పుర (కర్పూర) గంధీ! నీవు తప్పుగా భావించరాదు. నీ చిత్తం తెలుసుకుందామని ఇలా అన్నాను. ఉత్తపుణ్యానికి- ఈ భాగ్యానికి, ఓ ఇందుముఖీ! నీవిలా ఎందుకు కుందు- బాధ చెందుతున్నావు? అదీగాక-
ఉ॥ ‘కింకలు ముద్దుబల్కులును గెంపుగనుంగవ తియ్యమోవియున్
జంకెలు తేఱిచూపు లెకసెక్కెములున్ నెలవంకబొమ్మలుం
గొంకక వీడ నాడుటలు గూరిమియుం గల కాంత గూడుటల్
అంకిలి లేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా!’
… ఓ హరిణ లోచనా! కలభాషిణీ! అంకపొంకాలు- పొలయలుకలు (ప్రణయ కోపాలు), మురిపెంపు మాటలు, ఇంపైన బెదిరింపు చూపులు, తియ్యని కెమ్మోవి- పెదవి, ఎకసెక్కాలు- వేళాకోళాలు, నెలవంకల కనుబొమ్మలు, విదిలింపులు, అదలింపులు- కొంకు (జంకు, భయం) లేకుండా తూలనాడటాలు, వలపులు గల చెలువలతో అంకిలి- అడ్డు లేకుండా, అలుపెరుగని కలయిక- పొందు లభిస్తే జన్మ సఫలం చెందినట్లే గదా!
ఉ॥ ‘నీవు పతివ్రతామణివి నిర్మలధర్మ వివేకశీల స
ద్భావవు నీ మనోగతుల బాయక యెప్పుడు నస్మదీయ సం
సేవయ కాని యన్యము భజింపవు, పుట్టిన నాట నుండి నీ
భావమెఱింగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ’
.. ‘దేవీ! నీవు మహా పతివ్రతవు. ధర్మ, వివేక, సౌశీల్యాలు కలదానవు. నీకు బాల్యం నుంచి నా వరివస్య- సేవ తప్ప మరియొక యావ- ఆసక్తి, చింత లేనే లేదు. ఇదంతా తెలిసి కూడా, నేను నిన్నిలా బాధపెట్టినందుకు, ఓ మానినీ! నన్ను మన్నించు’ అని ఇంకా ఇలా అన్నాడు.. నా మాటల చేత ఓ వధూటీ! నా మీది నీ అనురాగం ఇంకా దృఢమవుతుంది. కాన, సకల సంపదలతో తులతూగే ఈ అతులమైన- సాటిలేని ద్వారకా నగరంలోని దివ్య మందిరాలలో నీ భాగ్యం కొద్దీ సంసారిలా (‘సంసారవైరీ కంసారిః మురారిః’- కంసునికి శత్రువైన మురారి సంసారానికి కూడా వైరియే!) నీ యందు అనురాగ బద్ధుడనై ప్రవర్తిస్తా. ఇంద్రియ లోలురాలై, వికృత స్వరూపిణి అయిన ఏ స్త్రీ కూడా నన్ను పొందడం కష్టం. అదీగాక, ముకుందుడ- ముక్తిదాయకుడనైన నన్ను, అల్పబుద్ధిగల కామాతురలైన భామలు- స్త్రీలు, వ్రతాలు తపస్సులతో దాంపత్య యోగం కోసం సేవిస్తారు. ఆ భావం కూడా దాట శక్యం- సాధ్యం కాని నా మాయా పాటవం వలన విజృంభించిందే! అందువలన ఓ కుందరదనా!
అట్టివారు మందభాగ్యలై- అదృష్టహీనలై, అరయంగా- విచారించగా నిరయాన్నే- నరకాన్నే పొందుతారు. ఓ వనితా! నీతో సాటి రాగల జోటి- కాంత ఈ అవనిలో లేదు. నీవు నీ వివాహకాలంలో నిన్ను పురస్కరించిన- వరించిన మాన్యులైన ఎందరో రాజన్యులను తిరస్కరించావు. ‘సౌజన్య మూర్తీ! నేను నీ దానను. ఈ నా మేను- దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు’ అంటూ ఒక బ్రహ్మణ్యుని- అగ్నిద్యోతనుని నా చెంతకు పంపావు. నేను నీ విన్నపం మన్నించి, వచ్చి నిన్ను వెంట తెచ్చుకొని వస్తున్న సమయంలో, నన్ను ఢీకొన్న నీ పెద్దన్నయ్యను మన్నిగొనక- చంపక నీ కన్నుల ముందే విరూపుని- వికార స్వరూపుణ్ని గావించాను. అది కని కూడా నీవు నా వియోగాన్ని సహించజాలక మిన్నకున్నావు. ఇలాంటి సమున్నతమైన నీ సుగుణాలకు, ఓ కాంతామణీ! నేనెంతగానో సంతసించాను’ అని పలికి దేవకీ తనయుడు మానవలోక మర్యాదలను- ధర్మాలను అనుసరిస్తూ సామాన్య గృహస్థు వలెనే తన గృహ కృత్యాలను కొనసాగించాడు.
శుకుడు- రాజా! శ్రీకృష్ణుడు ఇలా ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా నుడివిన ఆ అమృతంపు పలుకులకు ఆ కలికి రుక్మిణి ముఖ కమలం సంతోషంతో వికసించి వెలుగులీనింది. ఆమె చిరునవ్వులతో కూడిన వలపు చూపులతో, తలపులలో నగధరుని, ఖగ గమనుని, జగన్మోహనుని నిలిపి, అంజలి గావించి, ఆ దేవదేవుని- కంజలోచనుని వినుతించింది. నీలవేణి- నల్లనైన కురులు, కిసలయారుణ పాణి- చిగుళ్ల వలె ఎర్రని హస్తాలు గల, అతి మృదువాణి- ఆ రుక్మిణీదేవి అతి మధుర మంజుల మృదు పలుకులకు మనసు రంజిల్లగా మురభంజనుడు ఆ కంజముఖికి బహువిధాలైన వస్ర్తాభరణాలను బహూకరించాడు. ఇలా అమ్మానిని- రుక్మిణిని సమ్మానించిన పిమ్మట-
చ॥ ‘ఎలమి ఘటింపగా గలసి యీడెల నీడల మల్లికా లతా
వలి గరవీరజాతి విరవాదుల వీథుల గమ్మ దెమ్మెరల్
వొలయు నవీనవాసముల బొన్నల దిన్నెల బచ్చరచ్చలం
గొలకుల లేగెలంకులను గోరిక లీరిక లొత్తగ్రొత్తలై’
.. జగత్తుకి జననీ జనకులైన ఆ ఆది దంపతులు, ప్రకృతి పురుషులు, నూతన వధూవరులు, రుక్మిణీకృష్ణులు ఇరువురూ కొత్తకొత్త కోరికలు ఈరిక లెత్తగా- మొలకెత్తగా ఈడెల- ఎర్రనారింజ చెట్ల నీడలలోను, మల్లె పొదలలోను, గన్నేరులు జాజులు విరజాజుల వర- శ్రేష్ఠాలైన నికుంజాల (పొదరిండ్ల)లోను, చిరుగాలులకు పులకరించే చంద్రకాంత శిలల- చలువరాయి వేదికలపైనా, మరకతమణి సౌధాలలోనూ- పొన్నల ఛాయలలో, నున్నని తిన్నెలపైనా, పరిసర సరోవర తీరాలలో, మనోహర ఉద్యానవనాలలోనూ తనివితీరా విహరించారు. ఇలా, మాధవుడు రుక్మిణీదేవితో కలిసి మన్మథ విలాసాలలో మునిగితేలాడు. పై ‘చంపకమాల’ పద్యం, పోతన భాగవతంలోని ఇంపు సొంపుల పొలుపు- సుగంధాలతో గుబాళించే ఎంపికైన అసమాన సంపెంగ కుసుమాలలో ఒకటి. అసలీ ప్రసంగంలోని అనేక పద్య ప్రసూనాలు పోతన మహాకవి కవితా చేతన వనజాతాలైన నూతన ఉద్భావనలు- అందమైన గొప్ప కల్పనలు!
శుకముని- అవనీనాథా! రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు అందమైన ప్రద్యుమ్నాది పదిమంది పుత్రులు ప్రభవించారు. జాంబవతీ సత్యభామాది పట్టమహిషులకు, పదహారువేల వంద మంది సతులకు జగత్పతి వలన ఒక్కొక్కరికి పదిమంది సుతులు ఉద్భవించారు. రూపసు- సుందరులైన వారందరూ గుణాలలో తండ్రికి వీసం కూడా తీసిపోనివారు. ఆ పుత్రులందరికీ మరల పుత్రులు కలిగారు- ‘పుత్రాశ్చ పౌత్రాశ్చ కోటిశో బభూవ’. ఇలా పిల్ల చెరకుకు పిలకలు పుట్టినట్లు తామర తంపర- ఇతోధిక వృద్ధిగా విలసిల్లిన పుత్ర, పౌత్రులతో ఉరుక్రముడు పురుషోత్తముడు శోభించాడు. ఈవిధంగా యదు, వృష్ణి, భోజ, అంధకాది నూట ఒక్క నామా- శాఖలతో ఆ యాదవ వంశం చక్కగా వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్య నేర్పే అనవద్యు- సమర్థులైన గురువులే మూడుకోట్ల ఎనభై వేల వందమంది ఉన్నారంటే, ఇక ఆ యాదవ కుల బాలల సంఖ్య తెలపడానికి శూలికి- శివునకు గాని, తామర చూలికి- బ్రహ్మదేవునకు గాని వీలవుతుందా?
శ్రీమద్భాగవతంలోని అరవైయవ అధ్యాయ భావం చాలా దివ్యమైనది. అమాత్యుని అనువాదం కూడా అత్యద్భుతంగా, భవ్యంగా సాగింది. స్త్రీ బాధకం కాదు, ఉపరి పురుషుని పవిత్ర గార్హస్థ్య జీవనానికి సాధకం. కాని, స్త్రీ ఆసక్తి మాత్రం అత్యంత బాధకం. గీతలో తాను ఉపదేశించిన అనాసక్తి యోగాన్ని భగవంతుడు తన జీవిత- అవతార కాలంలో సంపూర్ణంగా పాటించి చరితార్థం చేశాడు. మహాయోగేశ్వరుడు కృష్ణుడు భోగియైనా త్యాగి. ఆయన భోగం యోగమయం, త్యాగ మూలకం- ఆసక్తి రహితం అని పూర్వాచార్యులు అపూర్వంగా వ్యాఖ్యానించి నిరూపించారు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006