హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే॥
(కలిసంతరణోపనిషత్తు)
రామనామం రెండు పాదాలైనా, కృష్ణ నామం రెండు పాదాలైనా కలియుగంలోని కల్మషాన్ని పోగొట్టేవే! అన్ని వేదాలలోనూ ఇంతకంటే మేలైన మంత్రం లేదని నారదునికి బ్రహ్మదేవుడు ప్రబోధించాడు. రామనామ మహిమ గురించి తెలియజేసే వృత్తాంతం ఇది. రాజయ్యాక రాముడొక యజ్ఞం చేశాడు. ఆ సమయంలో శకుంతుడనే సామంత రాజు వేటాడి అలసిపోయి యాగానికి వచ్చాడు. వేట నుంచి వచ్చిన అతను యజ్ఞవాటికలోకి వెళ్లడం సరికాదనుకున్నాడు. బయటి నుంచే రుషులకు నమస్కరించి వెనుదిరిగాడు. అక్కడే ఉన్న నారద మహర్షి.. ‘శకుంతుడు వశిష్ఠుడిపై చూపిన గౌరవం మీపై చూపలేదు’ అని విశ్వామిత్రుడితో అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన విశ్వామితుడ్రు తన శిష్యుడైన రాముణ్ని పిలిచాడు. ‘శకుంతుని తల తన పాదాలపై పడేలా చేయాల’ని ఆజ్ఞాపించాడు.
గురువాజ్ఞ మేరకు సరేనన్నాడు రాముడు. విషయం తెలిసి.. శకుంతుడు కకావికలమయ్యాడు. రాముడే ప్రతిజ్ఞ పూనితే.. ఈ లోకంలో తనను రక్షించేవాడు ఉండడని తలచాడు. ఆత్మహత్యకు పూనుకోవాలని భావిస్తాడు. అప్పుడు నారదుడు వారించి.. ‘తపస్సులో ఉన్న అంజనాదేవి శరణువేడమ’ని సలహా ఇచ్చాడు. ఆమె తపస్సు చేసే చోటికి వెళ్తాడు శకుంతుడు. అక్కడే అగ్నిగుండం ఏర్పరిచి ‘అంజనాదేవి శరణు శరణు‘ అంటూ అందులో దూకబోయినాడు. అంజనాదేవి అభయం ఇవ్వడంతో ఆత్మహత్య ప్రయత్నం విరమిస్తాడు. శకుంతుడిని రక్షించాల్సిందిగా తన కుమారుడైన ఆంజనేయుడిని ఆజ్ఞాపిస్తుంది అంజనాదేవి.
మాతృవాక్యాన్ని మన్నించి.. తన తోకను పెంచి, శకుంతుడి చుట్టూ రక్షణ వలయం నిర్మిస్తాడు హనుమ. రామనామం జపిస్తూ శకుంతుడికి కాపుకాస్తాడు. గురువు ఆజ్ఞ మేరకు శకుంతుడిని బంధించడానికి వచ్చిన రాముడు.. ఎన్ని బాణాలు ప్రయోగించినా.. రామనామం ముందు వృథా అయ్యాయి. చివరికి నారదుడు కల్పించుకొని శకుంతునితో ‘నీ తల ఆ బ్రహ్మర్షి పాదాలు తాకేలా క్షమాపణలు వేడుకోమ’ని చెబుతాడు. దాంతో రాముడి వాగ్దానం నెరవేరుతుంది. రామ నామం మహిమ లోకానికి తెలిసొచ్చింది.
పూర్వం జయదేవుడు అనే గొప్ప కృష్ణభక్తుడు ఉండేవాడు. గీత గోవిందం (సంస్కృత సంకీర్తనలు) రచించాడు. అతని భార్య పద్మావతి మహా పతివ్రత. ఒకసారి ‘భర్త మరణిస్తే సహగమనం చేసే మగువకన్న భర్త మరణ వార్త చెవిసోకగానే ప్రాణాలు విడిచిపెట్టే ఆడదే గొప్పద’ని వాళ్లు ఆశ్రయం పొందిన రాజు భార్యతో చెబుతుంది పద్మావతి. ఆమె మాటలు మహారాణి విశ్వసించదు. ఒకసారి జయదేవుడు ఇంట్లోలేని సమయంలో మహారాణి ఏడుస్తూ అక్కడికి వెళ్తుంది. ‘అమ్మా పద్మావతీ! అరణ్యంలో ఒక సింహం జయదేవుడిని సంహరించింది’ అన్నది. వెంటనే పద్మావతి ప్రాణాలు విడిచింది. రాణి బాధపడింది. జయదేవుడు వచ్చి నామ సంకీర్తనం గావించి.. తన భార్యను బతికించుకుంటాడు. ఇది ఆ భక్తుడిపై భగవానుడి అనుగ్రహం ఒక కారణమైతే, భగవన్నామ మహిమ అసలు కారణం అంటారు భాగవతులు. మహామంత్రంగా పరిగణించే ‘హరేరామ..’ నామం సదా పలికేవారికి భగవంతుడి రక్ష ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి పై ఉదంతాలు మంచి ఉదాహరణలు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ