Venkateswara Swamy Brahmotsavalu | కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్నపన తిరుమంజనంతో మొదలైన ఉత్సవాలు.. అక్టోబర్ 8వ తేదీ వరకు సాగనున్నాయి. అయితే, ఇక్కడ ఉత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. స్వామివారి వాహనసేవలు సైతం జరుగుతాయి. భారీ రథోత్సవం ఇక్కడ ప్రత్యేకత.
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలో ఆరాధన, సేవాకాలం, బాలభోగం, నివేదన, శాత్తుమురై కార్యక్రమాలు సాగాయి. ఆ తర్వాత శాంతిపాఠం, యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, మూర్తిమంత్ర హోమం, ధ్వజారోహణ, గరుడ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, భేరీపూజ, దేవతాహ్వానం, హోమం, నివేద, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత శేషవాహనంపై స్వామివారు విహరించారు.
అక్టోబర్ 1న ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలుంటాయి. సాయంత్రం స్వామివారు హంసవాహనంపై శ్రీశాల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. దసరా రోజున అంటే అక్టోబర్ 2న ఉదయం స్వామివారు సింహవాహన సేవ జరుగుతంది. సాయంత్రం అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ సిరిసిల్ల మానేరు నదీ తీరం వద్దకు చేరుకుంటారు. అక్కడ శమీ దర్శనం ఉంటుంది. 3న ఉదయం స్వామివారు తనకు ప్రీతికరమైన గరుడ వాహనంపై విహరిస్తారు. అలాగే, ఎదుర్కోలు ఉత్సవం, కల్యాణం వేడుక జరుగుతుంది.
రాత్రి హనుమంత వాహనంపై విహరిస్తారు. 4న ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై నుంచి భక్తులను అనుగ్రహిస్తారు. 5న ఆండాళ్ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం, రాత్రి గజవాహనసేవ, 6న రాత్రి పొన్నవాహనసేవ ఉంటుంది. 7న పౌర్ణమి రోజున ఉదయం నుంచి స్వామివారు రథంపై దర్శనం ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఉంటుంది. రాత్రి అశ్వవాహన సేవ ఉంటుంది. ఉత్సవాల్లో చివరి రోజైన 8న చక్రస్నానం, పుష్పయాగం, ధ్వజా అవరోహణం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.