అన్ని విషయాల్లో ప్రభువులా ప్రవర్తించిన శిష్యరికం గాని, అపోస్తులిజం గానీ చివరికి ప్రభువు లాంటి మరణాన్నే అభిలషించింది. ప్రభువు వాక్కు ప్రకటించడానికి దశ దిశలా వెళ్లిన శిష్యులు గానీ, అపోస్తులు గానీ, ఎక్కడెక్కడో తెలియని మారుమూలల్లో, ఇంకా చెప్పాలంటే హీనమైన, దిక్కుమాలిన పరిస్థితుల్లో హింసితులై ఇష్టంగానే చనిపోయారన్నది కఠోర సత్యం. ప్రభువుకు ఉన్నది పన్నెండు మందితో ఉన్న శిష్యరికం. ఆ పన్నెండు మందిలో మొట్టమొదట బలవన్మరణం తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకొన్నది ఇస్కరియోతు యూదా అని అందరికీ తెలిసిందే. ఆయన ఆనాటి యూదా మత పెద్దల కుట్రల్లో చిక్కుకొని, ధనాశకు లోనై అమ్ముడుపోయి, ప్రభువును పట్టిచ్చాడు. ధనాశతో స్వామి ద్రోహం చేశానని పశ్చాత్తాపం చెంది పొలంలోకి పోయి చెట్టుకు ఉరి వేసుకొని రక్తం కక్కుకొని మరణించాడు. మిగిలిన పదకొండు మంది, ప్రభువార్తలు ప్రకటించడానికై వెళ్లిన అపోస్తుల్లో కొందరు హింసలకు గురై చనిపోయారు.
మరికొందరు ప్రభువు కోసం హింసల్ని ఆహ్వానించుకొని ప్రాణాలు విడిచారు. వారైనా వీరైనా దాదాపు శిలువ మరణంలోనే ప్రభువును అనుసరించి తరించారు. ఇక్కడ గమనార్హమైన విషయం ఏమంటే, శిష్యులు వేరు. అపోస్తులు వేరు!! శిష్యుల్లో అపోస్తులు ఉండొచ్చునేమో గానీ అపోస్తుల్లో శిష్యులు మాత్రమే ఉండనవసరం లేదు. ప్రభువు చుట్టూ తిరుగుతూ ప్రభువునే అనుసరిస్తూ ప్రభువుకు తోడుగా నడచిన వారు శిష్యులు. ‘మీరు వెళ్లి, నేను తెలిపిన ఈ సత్యాల్ని లోకమంతటా విస్తరింప చేయండి’ అన్న ప్రభు ఆదేశాన్ని తమతమ భుజస్కంధాలపై మోసుకుపోయి ఆ శుభవార్తలను ప్రజలకు అందించడానికి ప్రత్యేకంగా పంపబడినవారు అపోస్తులు. ప్రభువును హింసించిన పౌలు.. క్రీస్తుకు శిష్యుడు కాడు. కానీ, మారిన తరువాత ప్రభు వాక్కును పంచడానికై దూర తీరాలకు వెళ్లాడు. అపోస్తుల్లోనే ఆద్యుడైన వ్యక్తిగా, వాక్శక్తిగా ఎదిగాడు. పేతురు స్వయంగా శిష్యాగ్రణి అయితే. పౌలును మాత్రం వాక్ ప్రచార అగ్రణిగా లోకం గణించింది.