శ్రీశైలం : కార్తీక మాసం సందర్భంగా శ్రీగిరులు శివన్నామస్మరణతో మార్మోగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసి.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాల కోసం బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్లు ఆర్జితసేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు ఈవో లవన్న తెలిపారు.
గర్భాలయ స్పర్శ దర్శనాలు నిలిపివేయగా, సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లిఖార్జున స్వామివారికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు సాగుతున్నాయని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. క్షేత్ర పరిధిలోని పరివార ఆలయాలు, పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు చిన్నారులు సందడి చేశారు. ఆలయ దక్షిణమాడవీధిలో కళారాధన వేదికపై చిన్నారులు చేసిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి.
మత్తు పదార్థాలకు అనుమతి లేదు – సీఎస్ఓ నర్సింహారెడ్డి
శ్రీశైల క్షేత్రానికి దర్శనార్థం వచ్చే భక్తులు తమ వాహనాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకురావొద్దని ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి హెచ్చరించారు. టోల్గేట్ వద్ద ప్రతినిత్యం వాహన తనిఖీలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. దేవస్థాన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.