దేవుడు ప్రేమ స్వరూపి. మన కోసం తన ప్రియ కుమారుడ్నే ఇక్కడికి పంపించాడు. మనం ఆయన ద్వారా మాత్రమే విమోచన పొందేలా, జీవించేలా చేశాడు. కాపలా లేని గొర్రెల్లా ఉన్న ప్రజలను చూసి జాలిపడ్డాడు. వారికి అనేక బోధనలు చేసి అందరిలోనూ ప్రేమను నింపాడు. ఓ రోజు చాలా పొద్దు పోయిన తర్వాత ప్రభువు శిష్యులు ఆ పూట భోజనం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రభువు బోధనలు వినడానికి వచ్చిన వారికి భోజనం పెట్టడంలో వాళ్లు విఫలం చెందారు.
అప్పుడు క్రీస్తు ‘మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడమ’న్నాడు. ‘ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయ’న్నారు వాళ్లు. అప్పుడు ప్రభువు అక్కడికి వచ్చిన వారందరినీ కూర్చో మన్నాడు. ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని పట్టుకొని ఆకాశం వైపు చూపుతూ ఆశీర్వదించాడు. ఆ రొట్టెలు విరిచి అందరికీ వడ్డించమని శిష్యులకు ఇచ్చాడు. చేపల్ని కూడా అందరికీ పంచమన్నాడు. అక్కడున్నవారందరూ తృప్తిగా తిన్నారు. ప్రభువు తమపై కురిపించిన ప్రేమకు ఎంతగానో ఆనందించారు.