‘తన ఆత్మను పరిశుద్ధ పరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు’ (దివ్య ఖురాన్: 91-9)
నేడు మనుషుల్లో పాపభీతి నశించిపోతున్నది. దీనిపై ఆత్మ పరిశీలన అవసరం. దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీ వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారు సదా గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుందనే భయం కలిగి ఉండే వ్యక్తికి రెండు స్వర్గాలు లభిస్తాయి’ అని ఖురాన్లో అల్లాహ్ సెలవిచ్చారు. దేవుడు మనిషికి మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకొనే విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాడు. దాని ఆధారంగా అతడు స్వర్గానికి వెళ్లాలా, నరకానికి వెళ్లాలా అనేది నిర్ణయించుకోవాలి. స్వర్గానికి వెళ్లాలి అనుకొనేవారు దైవం పట్ల భయం, భక్తి కలిగి ఉండాలి. దైవ ప్రవక్త (స) ప్రబోధం ప్రకారం.. పాపులను ప్రళయ దినాన నరకానికి తీసుకొచ్చినప్పుడు వారికి 70 వేల కళ్లాలుంటాయి. వారు అనేక కఠిన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది.
కాబట్టి ప్రతీ విశ్వాసి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటూ, పరలోక చింతనలో జీవితాన్ని గడపాలి. తాను నేర్చుకొన్న విద్యకు అనుగుణంగా మనిషి వాటిని ఆచరించాడా లేదా అనే విషయాన్ని దేవుడి దర్బారులో ప్రశ్నిస్తారు. ప్రతీ మనిషి తాను ఆర్జించిన జ్ఞానం ద్వారా అల్లాహ్ను గ్రహించగలగాలి. ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారానే డబ్బు సంపాదించాలి. దాన్ని షరియత్ అనుమతించిన పనుల్లోనే ఖర్చు పెట్టాలి. దుబారాగా ఖర్చు పెడితే పర లోకంలో నేరస్తుడిగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దేవుడిచ్చిన శారీరక శక్తిని, సామర్థ్యాన్ని దైవం ఆదేశాలను నిర్వర్తించడం కోసమే వినియోగించాలి. ప్రళయ దినాన భూమి కూడా మనుషులు చేసిన పాప పుణ్యాల గురించి సాక్ష్యం చెప్తుందని దైవ ప్రవక్త (స) బోధించారు. కాబట్టి క్షణమైనా పరలోకం పట్ల ఏమరుపాటు తగదు. దీని కోసం ఇహ లోకంలో భక్తి, విశ్వాసాలతో కూడిన జీవితాన్ని గడపాలి.