పరిశుభ్రతను ఉత్తమ సంస్కారంగా ఇస్లాం బోధిస్తుంది. ‘పరిశుభ్రత ఇస్లామ్ ధర్మంలో సగ భాగం’ అన్నారు మహనీయులు ముహమ్మద్ ప్రవక్త. పరిశుభ్రతను అలవరచుకున్నవారు అల్లాహ్కు ప్రేమపాత్రులని ఖురాన్ పేర్కొన్నది. ‘ప్రభూ.. అత్యధికంగా క్షమాపణ వేడుకునే వారిలోనూ, పరిశుద్ధంగా, పరిశుభ్రంగా ఉండేవారిలోనూ నన్ను చేర్చు’ అంటూ వేడుకోవాలనే విషయాన్ని ముహమ్మద్ ప్రవక్త నొక్కి చెప్పారంటే పరిశుభ్రతకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో అర్థమవుతున్నది. నమాజ్ చేయడానికి కూడా పరిశుభ్రంగా సిద్ధం కావాలి. నమాజ్ ముందు చేసే వుజూలో బాహ్య అవయవాలను నీళ్లతో కడుక్కోవాలి. మిస్వాక్ పుల్లతో దంతావధానం చేయాలి. అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు కావాలి. ఉత్తమ సంప్రదాయ, సంస్కారాలను శరీరానికి అలంకరించుకోవాలి. శారీరక శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా అవసరమని అల్లాహ్ ఖురాన్లో బోధించాడు.
ఆత్మను అవిశ్వాసం, మార్గభ్రష్టతలాంటి చెడులకు దూరంగా ఉంచి, పవిత్ర భావాలతో నింపుకోవడమే ఆత్మశుద్ధి. ప్రతి రోజూ ఐదు పూటల నమాజుకు ముందు మిస్వాక్ పుల్లతో దంతాలు శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం జుమా నమాజు కోసం తల స్నానం(గుసుల్) చేయాలి. గోళ్లు కత్తిరించుకోవడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, అత్తరు పూసుకోవడం ఇవన్నీ జుమా మర్యాదలో భాగం. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలని ఖురాన్ పేర్కొంటున్నది. ఇల్లు, వాకిలి, వీధుల్లో, ప్రజలు తిరిగే ప్రదేశాల్లో చెత్త, చెదారాన్ని వేయరాదని ప్రవక్త పేర్కొన్నారు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చేతులు కడుక్కోకుండా నీటి పాత్రలో చేతులు పెట్టకూడదు. ఎవరితోనూ కరచాలనం చేయరాదు. స్నానాల గదిలో, స్నానాలు చేసేచోట మూత్ర విసర్జన చేసే అలవాటును మానుకోవాలి. తహారత్, గుసుల్, వుజూ పాటించడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతితో పాటు శారీరక ఆరోగ్యమూ సొంతమవుతుంది.