Indira Ekadashi | సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని.. మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును ప్రసన్నం చేసుకొని మోక్ష ప్రాప్తి పొందవచ్చని చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 24 ఏకాదశులు వస్తుంటాయి. ప్రతినెలా కృష్ణపక్షంలో ఒకటి, కృష్టపక్షంలో మరొకటి వస్తాయి. మొత్తం నెలకు రెండు చొప్పున ఏడాదిలో 24 తిథులు వస్తాయి. ఈ ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉండగా.. మరీ ముఖ్యంగా ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజున పలు పరిహారాలు పాటించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృపక్షాల్లో వచ్చే ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల సద్గతులు లభిస్తాయని వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం చెబుతున్నది. అలాగే ఏకాదశి పూజను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని పితృపక్షాలుగా పిలుస్తారు. ఈ 15 రోజులపాటు పితృదేవతల అనుగ్రహం కోసం చేసే స్నానదాన జపాలతో పితృదేవతలు శాంతిస్తారు. ఫలితంగా వంశాభివృద్ధి కలుగుతుంది పండితులు చెబుతున్నారు. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటుండగా.. ఈ రోజున పితృదేవతలను స్మరిస్తూ నదీస్నానాలు, పిండప్రదానాలు, దానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 12.21 గంటలకు ప్రారంభమవుతుంది. వేద క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16న అర్ధరాత్రి 12.21 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, సనాతన ధర్మంలో నిషాకాలంలో ప్రదోష ఉపవాసం, పూజలు తప్ప అన్నిపండుగల్లో సూర్యోదయం నుంచి తేదీని లెక్కిస్తారు. అంటే సెప్టెంబర్ 17న బుధవారం ఇందిరా ఏకాదశి జరుపుకుంటారు. పితృకార్యాలు చేయడానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిథి ఉండాలని.. అలాగే, ఏకాదశి వ్రతం చేయాలంటే సూర్యోదయంతో ఏకాదశి తిథి ఉండాలని పండితులు పేర్కొంటున్నారు.
ఇందిరా ఏకాదశి వ్రతం చేసేవారంతా వేకువనే నిద్రలేచి నదీస్నానం చేసే పుణ్యం. వీలుకాని పక్షంలో స్నానం చేసే నీటిలోనే సమస్త నదీజలాలు, సకల తీర్థాలను ఆవాహన చేసి స్నానం ఆచరించినా నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసి లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం, కుంకుమలను అలంకరించాలి. తెల్లనిపూలతో పసుపు లేదంటే తెల్లనిపూలతో అర్చించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేసి.. పులిహోర, చక్రపొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే విష్ణువుకు తులసి ఆకులను సమర్పించడం మరచిపోకూడదు. ఎందుకంటే విష్ణువు తులసి లేని ఏ నైవేద్యాన్ని అంగీకరించడని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి మొక్కుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి.. బ్రహ్మచర్యం పాటించాలి.
ఇలా ఉపవాసం చేయడం వల్ల పితృలోకంలో ఉండే పూర్వీకులు మోక్షం పొందుతారు. ఉపవాసం ఉన్న వ్యక్తికి అక్షయ పుణ్యం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం చేసే వ్యక్తి దశమి రోజు నుంచి సాత్విక్తతను పాటించాలి. న్యూనతా భావన, పాపపు పనులు, తామసిక ధోరణులకు దూరంగా ఉండడం అవసరం. మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, పప్పులు, శనగలు, పచ్చిమిర్చి, భారీ ధాన్యాలను ఆహారంగా తీసుకోకూడదు. నూనె, కారంగా, నిల్వ ఉంచి ఆహారాలను తీసుకోకూడదు. దశమి నుంచి నియమాలు, క్రమశిక్షణతో ఉపవాస దీక్ష చేస్తే సంపూర్ణ ఫలితం ఉంటుంది చెబుతున్నారు. ఉపవాసం రోజున కోపం తెచ్చుకోవడం, అబద్ధాలు చెప్పడం, నిందలు వేయకూడదు. విష్ణు సహస్రనామం, హరినామ సంకీర్తన, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పటిస్తూ ఉండడం వల్ల ప్రత్యేక ఫలితం ఉంటుంది. రాత్రి పూట సైతం మేల్కొని విష్ణు నామస్మరణ చేస్తే చాలా పుణ్య ప్రదమని పండితులు చెబుతున్నారు.