భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ధర్మరాజుకి అశ్వమేథ యాగం చేయమని సలహా ఇస్తాడు. శ్రీకృష్ణుడి మాట శిరసావహించి యాగం చేస్తాడు ధర్మరాజు. నకుల సహదేవులు సైన్యంతో యాగ అశ్వరక్షకులుగా బయలుదేరుతారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పాలించేవాడు. ఆయన మహా పరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుపొందాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు.
తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతణ్ని వారిస్తాడు. మయూరధ్వజున్ని జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. మయూరధ్వజుణ్ని కలుస్తారు. ‘దానం కోరుకోమంటాడు’ రాజు. అందుకు శ్రీకృష్ణుడు ‘రాజా! తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఈ బ్రాహ్మణుడి కుమారుడిని పట్టుకుని చంపబోయింది. బాలుని విడిచిపట్టవలసిందని పార్థించాము. అప్పుడు సింహం మానవభాషలో ‘మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమ’ని కోరింది.
ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలో సగభాగం దానమిచ్చి బాలుణ్ని కాపాడమ’ని కోరుతాడు. ఆ మాటలు విని అందుకు మయూరధ్వజుడు అంగీకరిస్తాడు. అతని భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధిస్తాడు కృష్ణుడు. అందుకు తగినట్లుగానే భార్యాపుత్రులు మయూరధ్వజుడి శరీరాన్ని సగానికి కోస్తారు. ఆ దృశ్యం చూసిన ధర్మరాజు.. ఆ మహారాజు దానగుణానికి నివ్వెరపోతాడు.
ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు ‘తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మయూరధ్వజుడు ‘మహాత్మా! తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ, ఎడమభాగానికి ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమకన్ను బాధపడుతున్నది’ అంటూ వివరిస్తాడు. ఆశ్చర్యపోతాడు ధర్మరాజు.
మయూరధ్వజుడి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి’ అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. తథాస్తు అంటూ వరమిస్తాడు వాసుదేవుడు. ‘మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందునూ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవసాన్నిధ్యంలో ఉంటుంది.
ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాతనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. నిత్యం నీ దగ్గర దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ శిరస్సు మీద ఉంచిన దీపం రాత్రి సమయాల్లో బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది’ అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారంగా మారింది.
– శ్రీ భారతి