ఎంతటి మూర్ఖునికైనా అతను చేసే పనేంటో ముందుగానే తెలిసిపోతుంది. మంచిపనులు చేయడానికి ఎంతగా ఉత్సాహం చూపుతాడో, చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా సంశయిస్తాడన్నది కాదనలేని నిజం. ఇది చేయాలా, వద్దా అని తటపటాయిస్తాడు. ఈ ఆలోచించే పని అతను చేయకున్నా, అతనిలోని మరేదో చేస్తుంది. ఆ మరేదో మరేమిటో కాదు.. ఆ వ్యక్తి మనసులో ఉన్న ఆత్మసాక్షి. ప్రతి జీవునిలోనూ ఆత్మసాక్షి ఉంటుంది. అది కొన్నికొన్ని సూచిస్తూ ఉంటుంది. వినకుంటే, హెచ్చరిస్తుంది. ఒక చెడ్డ పని చేసే ముందు లోలోన ఓ సంఘర్షణ జరుగుతుంది. ఇది ఆ వ్యక్తి నైతికతపై ఆధారపడి ఉంటుంది.
‘నా గద్దింపు విని తిరుగుడి , ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపెదను’ బైబిల్లో దేవుడు పలికాడు. ఆయన తన వాణిని మనకు ఎలా వినిపించగలుగుతాడు? తల్లిదండ్రుల రూపంలో, చుట్టూ ఉన్న పెద్దల రూపంలో, కనబడక వినబడే నైతిక సూత్రాల రూపంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనలోనే ఆత్మసాక్షిగా నెలకొని ఉండి.. సదా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు 98667 55024