శ్రీశైలం : కార్తీక మాసం చివరి రోజు కావడంతో శనివారం శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారలను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పుష్కరిణి, పాతాళగంగలో స్నానాలు చేసి, నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం ఆలయానికి చేరుకొని క్యూలైన్ల ద్వారా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
భక్తుల శివన్నామస్మరణతో ఆలయం, పరిసరాలు మోర్మోగాయి. సాంప్రదాయ దుస్తులతో సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలతోపాటు వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన చేసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారని ఏఈవో హరిదాస్ తెలిపారు. సాయంత్రం దక్షిణ మాడవీధి హరిహరరాయ గోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
స్వామివారి సేవలో.. ట్రైనీ ఫారెస్ట్ అధికారులు
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ అటవీశాఖ ట్రైనింగ్ అధికారులు దర్శించుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో బీట్ ఆఫీసర్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్న 50 మంది అధికారుల బృందం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట దోమలపెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివకృష్ణ, బీట్ ఆఫీసర్ భీముడు ఉన్నారు.
శ్రీశైలం అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
శ్రీశైల మహా క్షేత్రాన్ని భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కార్తీకమాసం చివరి రోజున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రకారంలోని గోకులంలో గోపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిమాన్విత క్షేత్రానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. ప్రధానంగా క్షేత్రానికి వచ్చిన వారికి వసతి, వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పలు సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.