Laxmi Narasimha Swamy Naivedyam | లక్ష్మీనరసింహస్వామి భోజన ప్రియుడు. అందుకే ఈ భారీ దేవుడికి నివేదనలూ భారీగానే ఉంటాయి. సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు అర్చకస్వాములు. శుచిగా వండిన పదార్థాలను స్వామికి నివేదించి.. ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.
♦ స్వామివారికి మొట్టమొదటి నైవేద్యంగా పంచామృతాలను సమర్పిస్తారు. అభిషేకానికి ముందు నైవేద్యంతోపాటు తాంబూలం ఇస్తారు.
♦ ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 5.30 గంటలకు దద్దోజనాన్ని నివేదిస్తారు. ఇది శరీరంలో వేడిని నియంత్రించి చలువ చేస్తుంది. ఆవుపాల పెరుగు, శొంఠి, అల్లంతో దద్దోజనం వండుతారు. దీనినే బాలభోగం అని పిలుస్తారు.
♦ మధ్యాహ్నం 12.00- 12.30 గంటల సమయంలో మహారాజ భోగం పేరుతో స్వామివారికి మహా నైవేద్యం సమర్పిస్తారు. ఇందులో భాగంగా పులిహోర, శొండెలు, లడ్డూలు, జిలేబీలు, వడలు, బజ్జీలు, పాయసం, క్షీరాన్నం, కేసరిబాత్ నివేదిస్తారు.
♦ సాయంత్రం ఆరాధన తర్వాత పులిహోర, వడలు, దోసెలు, వడపప్పు, పానకం నివేదిస్తారు.
♦ ప్రతి శుక్రవారం ఊంజల్ సేవ సమయంలో క్షీరాన్నం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ప్రత్యేక పూజలోనూ నివేదనలు కొనసాగుతాయి. స్వామివారు ఈ నైవేద్యాలు ఆరగించి సంతుష్టుడు అవుతాడనీ.. తనను దర్శించడానికి వచ్చిన భక్తులను సంతోషంగా అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు. ఈ నైవేద్యాలన్నీ రామానుజ కూటమిలో సిద్ధం చేస్తారు.