అనగనగా ఒక గ్రామంలో యువ రైతు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతని తండ్రి తనకో మాట చెప్పేవాడు. ‘దొరికిన జింకతో జాగ్రత్త’ అని అంటుండేవాడు. తండ్రి మాటలు కొడుక్కి అర్థమయ్యేవి కాదు. ఎన్నిసార్లు అడిగినా సమయం వచ్చినప్పుడు చెబుతాను అనేవాడు. ఆ యువ రైతు పంటలు బాగా పండించి దండిగా సంపాదించాడు. సంపాదించే కొద్దీ అతనిలో మరింత ఆశ పెరిగింది. ఎక్కువ భూమి సంపాదించాలని తాపత్రయపడేవాడు. నిద్రాహారాలు మాని ఆస్తుల సంపాదనలోనే కాలం గడపసాగాడు. తండ్రి ఇదంతా గమనించసాగాడు.
కాలగమనంలో తండ్రి వృద్ధుడయ్యాడు. రేపోమాపో రాలిపోతానని అనుకున్న ఆ వృద్ధుడు కొడుకును దగ్గరికి పిలిచాడు. ‘నువ్వు పెద్దవాడివయ్యావు. పెద్ద ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇప్పటికైనా నా మాటల అర్థం తెలుసుకున్నావా?’ అని అడిగాడు. ‘తెలియదు, ఇప్పుడైనా ఆ మాటకు అర్థం చెప్పమ’ని కోరాడు కొడుకు. అప్పుడా తండ్రి ‘ఒక ఆటగాడు అడవికి వెళ్లాడు. ఉదయం నుంచి పొద్దు పోయేంతవరకు వేట కొనసాగించాడు. ఒక్క జంతువు కూడా దొరకలేదు. అతనిలో పట్టుదల పెరిగింది.
మరింత దూరం వెళ్లాడు. ఎంతో కష్టపడ్డాక, చివరగా ఒక జింక దొరికింది. ఆశబోతు అయిన ఆ వేటగాడు దాన్ని సరిగ్గా బంధించకుండా అక్కడే పొదలో ఉన్న మరో జింక కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతలో దొరికిన జింక తప్పించుకొని పోయింది. చాలా బాధపడ్డాడు. చేసేదేం లేక ఉత్త చేతులతో ఇంటి దారి పట్టాడు. జీవితం కూడా అంతే. మనకి దొరికిన సంపదను గానీ, స్థాయిని గానీ మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఉన్నది కాస్తా ఊడుతుంది.
దొరికిన జింక ‘ఎప్పుడెప్పుడు తప్పించుకుని పోదామా’ అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో అనుమానం లేదు. దాన్ని సాధించడానికి మనం ఎంతో కష్టపడి ఉంటాం. దానిపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా ఏమరుపాటుగా ఉంటే శ్రమకోర్చి సంపాదించింది కూడా చేయి జారిపోతుంది. కాబట్టి ఆశ మంచిదే కానీ అత్యాశ మంచిది కాదు’ అని వివరించాడు. దొరికిన జింక, పొదలోని రెండు జింకలకన్నా గొప్పదన్న విషయం అర్థం చేసుకున్నాడు యువ రైతు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821