Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులకు స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొంది. శ్రావణ మాసోత్సవాల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తూ.. కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించాలని గతంలో నిర్ణయించింది. ఈ క్రమంలో గత మూడురోజులుగా కేవలం స్పర్శ దర్శనాలు మాత్రమే కల్పిస్తూ వస్తున్నారు. అయితే, భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిర్దిష్ట సమయాల్లో నాలుగు విడుతలుగా దర్శనం కల్పిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.
మొదటి విడతలలో ఉదయం 6.45 నుంచి 8.30 వరకు, రెండో విడుతలో మధ్యాహ్నం 12.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మూడో విడతలో రాత్రి 8 నుంచి 9 వరకు, చివరగా రాత్రి 10 గంటల నుంచి 11.30 గంటల వరకు స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. భఖ్తులు స్పర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని.. లభ్యతను బట్టి గంట ముందుగా టికెట్లను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవస్థానానికి చెందిన అధికారి వెబ్సైట్ srisailadevasthanam.org టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక గతంలో నిర్ణయించినట్లుగా గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.