Dussehra Special | దసరా నవరాత్రులంటే.. బతుకమ్మల సందడికి జతగా అమ్మవారి అలంకారాలే గుర్తొస్తాయి. లక్ష్మి, సరస్వతి, కాళి, గాయత్రి, లలిత… ఇలా అమ్మ అనేక అవతారాల్లో కొలువుదీరుతుంది. అయితే, జనులందరి ఆలనా పాలనా చూసే ఈ పసిడిపాదాల తల్లి పసిబిడ్డగా మారితే ఎలా ఉంటుందని ఆలోచించారు సృజనకారులు. టెక్నాలజీని వాడి ఈ ముచ్చటైన రూపాలను సృష్టించారు. పరమేశ్వరిని పాల బుగ్గల రాణిలా చూస్తుంటే… చంకనేసుకుని చల్దిబువ్వ తినిపించాలి అనిపిస్తున్నది కదూ!
అమ్మా… ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు… అంటాడో కవి సిరుల తల్లి మీద అనురాగంతో. అంతేకాదు, పసిబాలవైతే ఎత్తుకొందు కదా పసిడి బుగ్గల పాలవెల్లీ… అనీ ఆర్తితో పాడుకుంటాడు. అవును అమ్మే ఎప్పుడూ మనల్ని లాలించాలా… ఆమెను మనం గారం చేయకూడదా… అనే ఆలోచన రావడం ఆమె మీద భక్త్యనురాగాలున్న వారికి సహజమే కావచ్చు. అందుకే పట్టు పరికిణీ వేసుకున్న పసిబిడ్డను చూస్తే బాలాంబలా ఉందంటూ మురిసిపోతాం. నవరాత్రుల్లో బాలలను జగదంబలా భావించి పూజిస్తాం. పూల సజ్జలో గౌరమ్మను తలకెత్తుకొని సందెవేళ జోలపాడి మురిసిపోయే సంప్రదాయం మనది. ఎవరెవరు ఏయే రూపాల్లో అమ్మను బాలగా తలుచుకున్నా… ఆమే నిజంగా ప్రత్యక్షం అయినంత అద్భుతంగా ఆ అవతారాలను ‘బేబీ గాడెస్’ పేరిట సృష్టిస్తున్నారు సృజనాత్మకత కలిగిన టెకీలు. గ్రాఫిక్ డిజైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ల సాయంతో వీటిని రూపుదిద్దుతున్నారు. నెట్టింట్లో ఇవి దసరా పండుగలా సందడి చేస్తున్నాయి.
దేవీ నవరాత్రుల్లో అలంకారాలు ఎన్ని రకాలుంటాయో… జగదాంబను ఏయే అవతారాల్లో మనం దర్శించి పూజిస్తామో అన్నీ ఈ రకం చిత్రాల్లో కనిపిస్తున్నాయి. నది ఒడ్డున మట్టిలో ఆడుకుంటున్న సరస్వతి, ఎర్రతామరలో ముద్దుగా కూర్చున్న లక్ష్మి, దోగాడుతూనే శివలింగాన్ని పూజిస్తున్న బాల ప్రసూనాంబ… ఇలా ముగురమ్మలూ వీటిలో ముచ్చటగా దర్శనమిస్తున్నారు. నోటిలో వేలితో… భుజం మీద చిలుకతో మధుర మీనాక్షమ్మ రూపం చంటి బిడ్డను తలపిస్తే, సింహాన్ని అనునయంగా అక్కున చేర్చుకున్న దుర్గమ్మ ముద్దులొలుకుతూ కనిపిస్తుంది. ఇప్పటి దాకా ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ అని పాడుకున్న వాళ్లూ… ఈ చిత్రాలను చూస్తూ ఇట్లా నిన్నెత్తుకొందుమమ్మ అని మురిసిపోతున్నారు!