గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో గోదావరి జన్మస్థానమైన త్రయంబకం క్షేత్రానికి ఏటా వెళ్లేవాడు. అక్కడ బొట్టు బొట్టుగా మొదలై.. గంభీరమైన నదిగా అవతరించే గోదావరికి ప్రత్యేక పూజలు చేసేవాడు. ఓ ఏడాది ఆశ్రమ బృందం త్రయంబకేశ్వర్ బయల్దేరుతున్నది. ఇంతలో ఆశ్రమం పక్కనే ఉన్న గ్రామానికి చెందిన యువకులు కొందరు వచ్చారు. తాము కూడా యాత్రకు వస్తామని కోరారు.
అందరినీ నదిలో స్నానం చేసి రమ్మన్నాడు గురువు. అందరూ సంతోషంగా నదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరారు. గురువు మాత్రం వారిలో కొందరినే ఎంపిక చేసి తనతో యాత్రకు రమ్మని చెప్పాడు. ఎంపిక కానివారు.. ‘మీతో రావడానికి మాకు ఎందుకు అర్హత లేదు’ అని గురువును అడిగారు. అప్పుడు గురువు.. ‘మన సంస్కృతిలో నదులను పవిత్రంగా భావిస్తాం. మన నాగరికత మొత్తం నదుల ఒడ్డునే అభివృద్ధి చెందింది.
నీరు లేకపోతే జీవితమే లేదు. అలాంటి నదుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మానవ మనుగడే ఉండదు. ప్రాచీన కాలంలో నగరాలన్నీ నదీ తీరంలోనే నిర్మితమయ్యాయి. మన దేశంలో రుషులు, మునులు.. నదీ తీరంలోనే తపస్సు చేసుకునేవారు. అలాంటి నదులను మనం పవిత్ర భావనతో గౌరవించి అవి కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఇందాక స్నానం ఆచరించే సమయంలో నదులపై మీ వైఖరి ఏంటో స్పష్టమైంది’ అన్నాడు గురువు.
‘మేం చేసిన నేరం ఏమిటి?’ అని మళ్లీ అడిగారు యువకులు. అప్పుడు గురువు ‘నేను చెప్పిందే తడవుగా మీరంతా నేరుగా నదిలోకి దిగారు. యాత్రకు ఎంపికైన వారు నదిలో అడుగు పెట్టడానికి ముందు.. ఆ గోదావరి తల్లికి నమస్కరించారు. ఆ పవిత్ర జలాలను దోసిట తీసుకొని తలపై చల్లుకున్నారు. ఆ తర్వాతే నదిలో పాదం మోపారు. అంటే వాళ్లు నదిని పవిత్రంగా భావించారు. తల్లిగా గౌరవించారు. అందుకే వారిని యాత్రకు నాతోపాటు రావడానికి ఆమోదించాను. నదులను గౌరవించడం అలవర్చుకున్న తర్వాత మిమ్మల్నీ తీసుకెళ్తాను’ అని వివరించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821