‘మన్ త్రాయతే ఇతి మంత్రః’ అంటే మనసును శుద్ధి చేసి, భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేదే మంత్రం. మంత్రజపం ద్వారా మనసు.. శాంతి, భక్తి, దైవంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడి పవిత్ర నామం దివ్యానందభరితమైనది. కృష్ణుడు, కృష్ణ నామం అభిన్నం. కృష్ణ నామం ప్రాపంచిక గుణాలతో మలినం కాజాలదు, అది నిత్యముక్తమైనది. శ్రీకృష్ణ నామాన్ని ‘చింతామణి’తో పోల్చారు. చింతామణి అంటే అది తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారిపోతుంది. అదే విధంగా, భగవన్నామాన్ని జపించడం ప్రారంభించగానే.. మనసులోని అసుర లక్షణాలన్నీ సద్దుమణిగి, మనసు పవిత్రతను సంతరించుకుంటుంది. ఈ విధంగా జపం కొనసాగించినట్లయితే ఆధ్యాత్మిక విజ్ఞానంలోని గుహ్య అంశాలన్నీ సాధకునికి వ్యక్తమై- శాంతి, ఆనందానుభూతి కలుగుతాయి.
కలియుగ ధర్మం
‘కలి కాలే నామ రూప కృష్ణావతార్’ అని పేర్కొన్నది చైతన్య చరితామృతం. అంటే కలియుగంలో శ్రీకృష్ణుడు తన పవిత్ర ‘నామ రూపం’లో అవతరించాడు. కలియుగం దోషసాగరమే అయినా, దీనిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే, కేవలం హరేకృష్ణ నామ సంకీర్తనం చేస్తే చాలు.. మనుజుడు భవబంధ విముక్తుడై పరంధామాన్ని చేరుకోగలడు. సత్య యుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో విగ్రహారాధన ముక్తి మార్గాలుగా ఉండేవి. కలి యుగంలో కేవలం నామ సంకీర్తన యజ్ఞం చేస్తే చాలు.. భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఇది జాతి, మత, లింగ భేదాలు లేకుండా అందరూ ఆచరించగలది. యజ్ఞం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే (విష్ణువే).
సంకీర్తన యజ్ఞంలో కేవలం కీర్తించడం మాత్రమే కాక, భగవంతుని స్తుతులను వినడం (శ్రవణం) కూడా ఇమిడి ఉంటుంది, తద్వారా నిరంతర స్మరణం సాధ్యపడుతుంది. నిరంతర హరి నామ స్మరణం చేయడం ద్వారా జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది, భగవంతుడు, ఆయన భక్తులు నివసించే ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోగలం. మధ్వాచార్యులు, రామానుజా చార్యులు లాంటి అనేక మంది ఆచార్యులు మరియు భక్తి సాంప్రదాయానికి చెందిన ఇతర మహాత్ములు కూడా గతంలో శాస్త్ర ఆధారితంగా ఈ ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పారు.
శ్రీచైతన్య మహాప్రభువుల వారు ఈ కలియుగంలో హరినామ సంకీర్తనాన్ని ప్రధాన ముక్తిమార్గంగా ప్రబోధించారు. ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా’ (కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం, దానికి మించి వేరొక మార్గం లేదు) అని బృహన్నారదీయ పురాణం వివరిస్తుంది.
ద్వాపరంలో విస్తృత ఆరాధన పద్ధతులతో ప్రసన్నుడయ్యే శ్రీకృష్ణుడు, కలియుగంలో మాత్రం కేవలం నామ సంకీర్తన మాత్రంతో అత్యంత ప్రసన్నుడు అవుతాడు.
హరేకృష్ణ మహామంత్రం- జప పద్ధతిశ్రీచైతన్య మహాప్రభువుల వారు కలియుగవాసులకు ఉపదేశించిన మహామంత్రం ఇదే:
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
కలి సంతరణ ఉపనిషత్తులోని ఈ పదహారు నామాలు.. కలి కల్మషాలను నిర్మూలించడం కోసం ఉద్దేశించినవి. దీనికి ప్రత్యామ్నాయం వైదిక శాస్ర్తాలలో మరొకటి లేదు. ఈ మహామంత్రంలోని పదహారు నామాలను జపించడం ప్రస్తుత యుగంలో సమస్త మానవాళి ఆచరింపదగిన ధర్మం. దీనికి జాతి, మత, లింగ బేధాలేవీ అడ్డురావు.
జప విధానం: జపించడం అంటే మంత్రాన్ని మృదువుగా ఉచ్ఛరిస్తూ, భక్తి శ్రద్ధలతో వినడం.
ఈ మంత్రం కేవలం మనసులో జపించేది కాదు; జిహ్వ, పెదాలను కదిలిస్తూ ఉచ్ఛరించి శ్రద్ధగా వినాలి. ప్రతిరోజూ నిర్ణీత సంఖ్యలో జపించాలి. ఒక్క మాల (108 సార్లు) జపించడానికి సుమారు 10 నిమిషాలు పడుతుంది. శ్రీల ప్రభుపాదుల లాంటి పరంపరాచార్యుల నుంచి ఈ మంత్రాన్ని స్వీకరించి, వారిని గురువుగా స్వీకరించి జపించడం వల్ల ప్రామాణికత చేకూరి త్వరగా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు.
మహామంత్రాన్ని జపించడానికి మంచి రోజు, శుభ ముహూర్తం కోసం వేచి చూడవలసిన అవసరం లేదు ‘శుభస్య శీఘ్రం’. కేవలం భగవన్నామాలను జపించడం ద్వారా కృష్ణలీలల్లో మనం కూడా పాలుపంచుకో గలుగుతాం. శ్రీల ప్రభుపాదుల వారి సందేశం ప్రకారం, ప్రతి ఒక్కరూ హరేకృష్ణ మంత్రాన్ని జపించి ఆనందంగా జీవించండి.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 93969 56984