క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడు. ప్రభువు పేర్కొన్న అంశాలు చెరగని, చెరపలేని సత్యాలుగా మిగిలిపోయాయి. అసత్యభావాల్ని, మూఢ విశ్వాసాల్నీ శుద్ధి చేసే అగ్ని కిరణాలు ఆయన వచనాలు.
ఆనాటి స్వార్థ పూరితమైన సంఘ వ్యవస్థకు ఎన్నో అవస్థలు తెచ్చి పెట్టిన విప్లవ భావాలు ప్రభువు వాక్కులు. అందుకే ఆ భావాల్ని చంపలేక క్రీస్తునే అంతమొందించారు. ప్రభువును పొట్టన పెట్టుకున్నవాళ్లే ఆ తర్వాతి కాలంలో క్రీస్తు అనుచరుల్నీ చంపే వేట కొనసాగించారు. క్రీస్తు కోసం మరణించిన వారిలో స్టీఫెన్ పరిపూర్ణ విశ్వాసి.
ప్రాణం పోయినా క్రీస్తును ఏమాత్రం విడువను అనడంతో అతణ్ని రాళ్లతో కొట్టి చంపేశారు. క్రీస్తు చప్పిన సత్యానికి సాక్షిగా నిలిచి హతుడైపోయాడు. అందుకే ఆయన తొలి హతసాక్షి. ఈ కోవలో ఎందరెందరో ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి రోమాన్ చక్రవర్తి ఆజ్ఞల్ని శిరసావహించి సెయింట్ పౌల్ క్రీస్తు అనుచరులపై దాడి చేశాడు. ఆయన మనసు మార్చుకొని, క్రీస్తు సువార్త బోధించిన అగ్రేసరుల్లో ఒకరిగా నిలిచాడు. చివరికి ఆయన కూడా హతసాక్షిగా ప్రాణాలు వదిలాడు. ప్రేమికుల్ని విడగొట్టగలం. కాకుంటే చంపగలం. కానీ, ప్రేమను మాత్రం చంపలేం కదా! ప్రభువు దాసులను చంపారేమో కానీ, ఆయన సందేశాన్ని అంతం చేయలేకపోయారు!
– ప్రొ॥బెర్నార్డ్ రాజు 97042 65997