ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః
(మాండూక్య, ముండక కైవల్య ప్రశ్నాద్ ఉపనిషత్తులు)
‘ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రదమగు దానినే దర్శించెదము గాక’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం.భద్రమైన (మంగళప్రదమైన) మాటలే వినాలి. వాటిని శ్రేయోభిలాషులే చెబుతారు. అందుకు ఉదాహరణగా ఈ కింది కథను చెప్పుకోవచ్చు.
ఒకసారి కాశీరాజు తన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ ముగ్గురినీ తన తమ్మునికిచ్చి వివాహం చేయాలని తలపోస్తాడు భీష్ముడు. వారిని అపహరిస్తాడు. కానీ, అంబ సాల్వరాజును అదివరకే ప్రేమిస్తుంది. అదే విషయం భీష్ముడితో చెప్పగా.. ఆమెను అతని దగ్గరికి సాదరంగా పంపుతాడు భీష్ముడు. కానీ, సాల్వరాజు ‘అపహరణలో భీష్ముని చేతిలో మేము ఓడిపోయాం. నేను నిన్ను స్వీకరించను’ అంటాడు. అప్పడు భీష్మునితో అంబ ‘నువ్వే నన్ను వివాహం చేసుకో’ అంటుంది. దానికి ఆయన ‘నేను బ్రహ్మచర్య దీక్షలోనే జన్మంతా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి కుదరదు’ అంటాడు. ఆమె భీష్ముని గురువైన పరశురాముణ్ని వేడుకుంటుంది. అంబను పెళ్లి చేసుకోవాలని భీష్ముణ్ని ఆజ్ఞాపిస్తాడు పరశురాముడు. దానికి భీష్ముడు ఒప్పుకోడు. గురుశిష్యులిద్దరి మధ్యా భీకరమైన యుద్ధం జరుగుతుంది.
చివరికి మోహనాస్ర్తాన్ని ప్రయోగించడానికి పూనుకుంటాడు భీష్ముడు. అది చాలా ప్రమాదకరమైనది. వెంటనే నారదుడు వచ్చి సర్ది చెబుతాడు. ‘గురువును సంహరించిన పాపం తగులుతుంది సుమా!’ అని హెచ్చరిస్తాడు. నారదుని ఆనతి శిరసావహిస్తాడు భీష్ముడు. అప్పుడు భీష్ముడి తల్లి అయిన గంగాదేవి ఏతెంచి.. ‘నా కుమారుడు యుద్ధం చేస్తున్నది గురువుపై భక్తి లేక కాదు! ధర్మం కోసం నిలబడ్డందుకు.
గురుభక్తి వల్లే మోహనాస్త్రం ప్రయోగించలేదు’ అని పరశురాముడికి చెబుతుంది.
ఇద్దరూ సమాధానపడి యుద్ధం విరమిస్తారు. నారదుడు, గంగాదేవి ఇద్దరూ వాళ్లకు శ్రేయోభిలాషులే కాక, లోక కల్యాణాన్ని కాంక్షించేవారు. కాబట్టి, ఈ సమస్యకు సామరస్యమైన పరిష్కారం లభించింది. భీష్ముడు, పరశురాముడు ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఈ మంచి మాటలు వినకుండా మొండిగా వ్యవహరించినా.. దారుణం జరిగేది కదా! అందుకే, ప్రకృతిలో భద్రమైన మాటలు వినాలి. ధర్మమార్గంలో నడవాలి.
– డా॥ వెలుదండ సత్యనారాయణ