వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో సాధన చాలా అవసరం. సాధన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలి. ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్నారు పెద్దలు. ఎంత సాధన చేస్తే మనసు అంత తేలిక అవుతుంది. ప్రయత్నం చేయగా చేయగా ఎంతటి కఠిన కార్యమైనా చేయగలుగుతాం. అయితే సాధన చేయడం చెప్పినంత తేలిక కాదు. జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే గానీ, దానిని సాధించలేం. సాధారణ వ్యక్తులు సైతం సాధనతో తపోధనులుగా ఖ్యాతి గడించారు.
మనిషి జీవితం సాధనతోనే మొదలవుతుంది. బోర్లాపడటం దగ్గర్నుంచి అక్షరాలు కూడబలుక్కొని పలకడం, తడబడు అడుగులతో నడక నేర్వడం.. ఇలా పసితనంలో ప్రతి ఒక్కరూ తీవ్ర సాధకులే. వయసు పెరిగే కొద్దీ లౌకిక విషయాలపై ఆసక్తితో సాధనకు చాలామంది దూరమవుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో చాలామంది దానికి ఇంకా సమయం ఉందని తీర్మానించుకుంటారు. అన్ని బాధ్యతలు తీరిన తర్వాత సాధన చేసుకోవచ్చులే అని నిశ్చయించుకుంటారు. కానీ, ఆధ్యాత్మిక సాధనకు యవ్వనమే సరైన సమయం అంటారు పెద్దలు. వృద్ధాప్యంలో తీరిక కుదురుతుందేమో కానీ, సాధన నిలబడదు. యవ్వన దశ నుంచి చేసే సాధన వార్ధక్యం వచ్చే సరికి పరిపూర్ణత్వానికి దారితీస్తుంది.
యవ్వనంలో ఉన్న ఇంద్రియశక్తులు వృద్ధాప్యం వచ్చేసరికి చల్లబడిపోతాయి. శరీరం పటుత్వం కోల్పోయి దేనికీ అంతగా సహకరించదు. శరీరంలోని కణాలు వృద్ధి పొందలేవు. ఒక్కో కణం నిర్వీర్యం అవుతూ ఉంటుంది. ప్రతి విషయం లో, పనిలో ఆసరా అవసరమవుతుంది. శరీరంతో జరగవలసిన సహజ క్రియలన్నీ నశించిపోయి ఔషధ సాధన చేయాల్సి వస్తుంది. జీవితంలో క్లిష్ట దశగా అభివర్ణించే వృద్ధాప్యాన్ని ఊహించుకుంటేనే ఒక రకమైన భయం ఆవరిస్తుంది. వృద్ధాప్యం వచ్చాక గానీ, మనిషి జన్మ ఎంత దుర్భరమో అర్థం కాదు. వార్ధక్యాన్ని భరించలేక అప్పటికప్పుడు సాధన మొదలుపెట్టి మోక్షం కావాలంటే దొరకదు. దానికి ముందు నుంచే తీవ్ర సాధన చేయాలి. ఎప్పుడో వయసు ఉడిగిపోయిన తర్వాత, శరీరం సహకరించక జన్మ రాహిత్యం కోరుకోవడం హాస్యాస్పదమే అవుతుంది!
బాధ్యతలన్నీ తీరిన తర్వాత విశ్రాంత జీవితంలో ప్రశాంతంగా దైవారాధన, ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చులే అనుకుంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కంఠంలో కఫం గురగురలాడుతుంటే ఈశ్వర నామం పలకలేం. మనసారా నారాయణ నామం అందామన్నా.. మాట పెగలదు. అర్చన చేద్దామంటే వణికే చేతులు సహకరించవు. ఆలయానికి వెళ్దామంటే నడిచే పరిస్థితి ఉండదు. ప్రాణనాడులు తెగిపోతూ ఉండగా భగవంతుడిని తలుచుకోలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంద్రియాలు, మనోబుద్ధులు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవన్నామం ఉచ్ఛరించాలి. మనసుతో ఆయన మహిమను చూడాలి. ఆయన లీలలను అర్థం చేసుకోవాలి. గొంతెమ్మ కోర్కెలతో చేసే సాధన తాత్కాలిక ఫలితాలను ఇస్తుందేమో కానీ, శాశ్వతమైన మోక్షత్వానికి దారి తీయదని గుర్తుంచుకోవాలి.
సాధన అంటే దైవాన్ని కనులారా దర్శించాలి, నోరారా పిలవాలి, చేతులారా మొక్కాలి, మనసారా ఆరాధించాలి. అదే నిజమైన సాధన. అప్పుడే మనకు స్వామి కరుణ తప్పక లభిస్తుంది. తద్వారా భక్తి అలవడుతుంది. కుటుంబ పోషణ నిర్వహిస్తూనే రాగద్వేషాలను జయించాలి. అదే నిజమైన సాధకుడికి ఉండవలసిన లక్షణం. అంతకుమించి దైవంపై అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఉండాలి. భక్తి లేని సాధన, సాధన లేని భక్తి అర్థ రహితం. సాధన ద్వారానే భక్తి, జ్ఞానం కలుగుతాయి. భగవంతుడి అనుగ్రహంగా కలిగిన భక్తి, జ్ఞానాలు సాధకుడిని సర్వోన్నత స్థాయికి తీసుకువెళ్తాయనడంలో సందేహం లేదు.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027