Festivals Calendar | ఈ క్యాలెండర్ ఇయర్లో ప్రస్తుతం మే నెల కొనసాగుతున్నది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సారి మే నెలలో సూర్యుడు, గురువు, రాహువు, కేతువు వంటి కీలక గ్రహాలు రాశిచక్రాలు మారబోతున్నాయి. గురువు వృషభం నుంచి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే, రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉండగా.. తిరోగమణం చెంది కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. ఈ గ్రహాల రాశిచక్రం మార్పుతో జీవితంలో మార్పులు జరుగనున్నాయి. మరో వైపు ఈ నెల శుభప్రదంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే శుభ ముహూర్తాలు మొదలవనున్నాయి. వివాహాలు, కేశఖండనం, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత శ్రావణ మాసం, తీజ్, రాఖీపౌర్ణమి, జన్మాష్టమి వంటి పండుగల సీజన్ మొదలవుతుంది. ఈ సుముహూర్తాల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. కేవలం పండుగలు మాత్రమే కాకుండా కుటుంబంలో ఉత్సాహం, భక్తిభావం వెల్లివిరుస్తుంది. శ్రావణ మాసంలోని సోమవారాల్లో శివుడిని కొలుస్తుంటారు. అలాగే, మహిళలు హరియాలి తీజ్‌ని జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. జన్మాష్టమి రోజున పెద్ద సంఖ్యలో జనం శ్రీకృష్ణుడిని కొలుస్తుంటారు. ఈ ఏడాది ఏ రోజున ఏ ఉత్సవాలు జరుగనున్నాయి.. ఏ రోజుల్లో ఏం ప్రత్యేకత ఉన్నదో తెలుసుకుందాం పదండి..!
హిందూ క్యాలెండర్ శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉన్నది. శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని భక్తితో కొలుస్తుంటారు. ప్రతి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటూ మహాదేవుడిని భక్తితో కొలుస్తారు. పరమేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు. తద్వారా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. ఈ మాసంలో వర్షరుతువుతో పరిసరాలు పచ్చగా కళకళలాడుతుంటాయి. ఇండ్లన్నీ పూజలతో సందడిగా మారుతాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలతో ఇండ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. శ్రావణ మాసమంటే ఒక పూజలే కాదు ఆనందాల కాలంగా పేర్కొంటారు. శ్రావణం లక్ష్మీదేవి కొలువుండే మాసం. అమ్మవారికి ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. అందుకే వ్రతాలు, నోములు నోచుకునే మహిళలు శ్రావణమాసంలో నోచుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 11 నుంచి ప్రారంభమవుతుంది.
పంచాంగం ప్రకారం.. హరియాలి తీజ్ శ్రావణ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్ష పక్ష తృతీయ తిథి జులై 26న రాత్రి 10.41 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజున శివశక్తులను పూజించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పెరుగుతుందని, వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తుంది. హరియాలి తీజ్‌ని కొన్ని ప్రాంతాల్లో హర్తాళిక తీజ్ పేరుతో పిలుస్తారు. ఈ రోజున వివాహితులు భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. సింజార (సింధర) కూడా మహిళల కోసం హరియాలీ తీజ్‌లో తల్లి ఇంటి నుంచి వస్తుంది. వివాహమైన ప్రతి మహిళ హరియాలీ తీజ్‌లో పుట్టింటి నుంచి సింజారా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పుట్టింటి నుంచి బట్టలు, నగలు, అలంకరణ వస్తువులు, పిండి వంటలను పంపుతారు. ఇదే సింజారా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో సారె అని పిలుస్తారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కోరుకుంటూ చేతికి రాఖీకడుతారు. ప్రతికూలత, దురదృష్టం నుంచి రక్షించేందుకు రక్షాబంధన్‌తో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ ధరించిన వారి ఆలోచనలు సానుకూలంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. రక్షాబంధన్ ప్రస్తుతం రాఖీ రూపంలోకి వచ్చినప్పటికీ దాని ఉద్దేశ్యం అన్నాచెల్లెళ్ల బంధాన్ని బలంగా ఉంచుతుందని భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం రక్షా బంధన్‌ను ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షా బంధన్ పండుగ ఆగస్టు 9 రానున్నది.
ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి బాధ్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 16న జరుపుకుంటాం. ఈ రోజును శ్రీ కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ తేదీన శ్రీ కృష్ణుడిని పూజించడం ద్వారా భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మురళీ మనోహరుడు జన్మించిన రోజును జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి పేరుతో వేడుకలను ఉత్సాహంగా జరుపుతారు. ఈ రోజున చిన్నారులను శ్రీకృష్ణుడి రూపంలో అలంకరిస్తారు. జన్మాష్టమి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ప్రతి సంవత్సరం భద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశ్ చతుర్థి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయకుడు అవతరించాడని భక్తుల విశ్వాసం. ఈ రోజున విఘ్నాదిపతిని పూజించడం ద్వారా భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయి. వినాయకుడి ఆశీస్సులు లభించి ఏవైనా కార్యాల్లో అడ్డంకులుంటే తొలగిపోతాయని నమ్మకం. ఈ సంవత్సరం వినాయక చతుర్థి పండుగ ఆగస్టు 27న జరుపుకోనున్నారు. వినాయక చవితి రోజున వినాయకుడిని మండపాల్లో ప్రతిష్టించిన నవరాత్రుల పాటు పూజిస్తారు. వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఉత్సాహంగా పాల్గొంటారు.
భారతదేశంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో నవరూపాల్లో దుర్గాదేవిని కొలువడం ఆనవాయితీగా వస్తున్నది. దేశవ్యాప్తంగా నలుమూల్లో దుర్గామాతను భక్తులు కొలుస్తారు. ఈ సారి దేవీ నవరాత్రులు సెప్టెబర్ 22 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 2న ముగియనున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఘటాలను స్థాపిస్తారు. ఘటనస్థాపనకు ముహూర్ ఉదయం 6.09 గంటల నుంచి ఉదయం 8.06 గంటల వరకు ఉంది. అలాగే, అభిజీత్ ముహూర్తం ఉదయం 11.49 గంటల నుంచి మధ్యాహ్నం 12.38 గంటలు. తెలంగాణలో నవరాత్రి వేడుకలకు ముందు రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి. ఈ పండుగ కోసం మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఉయ్యాల పాటలు పాడుతూ ఉత్సాహంగా పండుగలో పాల్గొంటారు.
అశ్విని మాసంలో శుక్ల పక్ష దశమి రోజున దసరా పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. హిందు పండుగల్లో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 2న జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. ముందు నవరాత్రులు దుర్గపూజ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమి రోజున రాముడు రావణునిపై విజయం సాధించాడని పండితులు చెబుతున్నారు. పాండవులు వనవాసం వెళ్తూ శమీ వృక్షంపై పెట్టిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నది ఇదేరోజేనని చెబుతున్నారు. దసరా పండుగ రోజుల్లో రావణ వధ, జమ్మిచెట్టుకు పూజా చేయటం ఆనవాయితీగా వస్తుంది. జగన్మాత దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు.
కర్వా చౌత్ వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి, వారి శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అట్లతద్ది పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను కార్తీక మాసం కృష్ణ చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం కర్వా చౌత్ అక్టోబర్ 10న జరుపుకోనున్నారు.
దీపావళి పండుగ ఐదురోజుల పాటు సాగుతుంది. సంబురాల్లో మూడు రోజున జరుపుకునే పర్వదినమే దీపావళి. వేదవ్యాసుడు రచించిన వరాహ పురాణం ప్రకారం.. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడి సంహరిస్తాడు. ఆ మరుసటి రోజునే దీపావళి పండుగ జరుపుకుంటారు. లోకానికి నరకుని పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి. వాల్మీకి రామాయణం ప్రకారం.. అరణ్యవాసం తర్వాత.. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సమయంలో ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారు. ఐదురోజుల పండుగలో అక్టోబర్ 18న ధంతేరాస్. అక్టోబర్ 20న నరక ఛతుర్దశి, అక్టోబర్ 21న దీపావళి, అక్టోబర్ 22న గోవర్ధన పూజ, అక్టోబర్ 23న భాయ్‌దూజ్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
హిందూ క్యాలెండర్లో కార్తీక మాసానికి సైతం ప్రత్యేక ఉంటుంది. ఈ మాసం శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం మొదలవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం పరమేశ్వరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకత ఉన్నది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే అన్నీ పండుగ రోజులే. అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 8న మొదలై.. నవంబర్ 5తో ముగుస్తుంది.
ఛట్ పూజ దేశంలో బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాల్గో రోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతికి ఛట్ పూజ దగ్గరగా ఉంటుంది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. అక్టోబర్ 25న నహాయ్ ఖాయ్, 26న ఖర్నా, 27న మెహలా ఆర్ఘ్య్, 28న పార్నాతో వేడుకలు ముగుస్తాయి.