కం॥ ‘గజరాజ మోక్షణంబును
నిజముగఁ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజ వరదుఁడిచ్చును,
గజతురగ స్యందనములుఁ గైవల్యంబున్’
పరమర్షి శుకుడు పరీక్షిత్తుతో… రాజా! గజరాజ మోక్షణ కథను నిజంగా- భక్తితో నియమంగా, నిష్ఠగా చదివే సంయమ వరిష్ఠులకు విష్టర శ్రవుడు- విష్ణువు, ఇహంలో ఏనుగులు, గుర్రాలు, రథాలు- ద్విచక్ర, చతుశ్చక్ర వాహనాలు, వనాలు, భవనాలు కలిగిన ధన భోగాలను, పరంలో పరంధామాన్ని- మోక్షసుఖాన్ని ప్రసాదిస్తాడు.
రాజా! అలుపులేకుండా గెలుపుపై తలపు నిలుపుకొని కరితో పోరు సలుపుతున్న మకరి శిరస్సును హరిచక్రం- సుదర్శనం విక్రమించి రెప్పపాటులో నరికింది. గజరాజు గ్రాహపు పట్టు విడిపించుకొని పూనికతో పాదం కదిలించి విదిలించాడు. అతను కారుచీకటి నుంచి వెలువడిన కళాధరు- చంద్రుని వలె, సంసార బంధాల నుంచి విడివడిన సన్యాసి వలె విరాజిల్లాడు. విజయ సూచకంగా ప్రభ విష్ణువు పాంచజన్య శంఖం పూరించాడు…
శా॥ ‘పూరించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్నదైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్.’
‘ఆ శంఖం సౌజన్యంతో కూడిన కరుణ రసానికి వరుణాలయం (సాగరం) వంటిది. పెనుశబ్దంతో సంచలనాత్మకంగా అచంచలాలైన పంచభూతాలను కూడా పటాపంచలు చేసేది. అదభ్ర (అంతులేని) శక్తితోకూడిన శుభ్రమైన ప్రభలతో ఇంద్రాది ప్రభువులకు కూడా గుబులు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది. శత్రుసైన్యాలను తుత్తునియలు గావించేది!’ అంత్యప్రాసల వింత సోయగాల.. పై శార్దూల వృత్తం మన పోతన చిత్తజాతమే! సొంతమే!!
పోతన ఉవాచ- పురుషోత్తముడు తన పొడవైన హస్తం చాచి గజరాజును మడుగు నుంచి వెడలించాడు. ‘హస్తిలోకనాథుఁడజ్ఞాన రహితుడై విష్ణురూపుఁడగుచు వెలుఁగుచుండె- శ్రీహరి కరస్పర్శతో కరిరాజు శరీరంలోని పరితాపమంతా హరించుకుపోయింది. అజ్ఞానం అంతరించింది. సుజ్ఞానియై విష్ణుదేవుని సారూప్యం పొంది విరాజిల్లాడు. రాజా! ఇభ (గజ)రాజు గతజన్మలో ద్రవిడ దేశాధిపతి అయిన ఇంద్రద్యుమ్న మహారాజు. విష్ణుభక్తులలో గణ్యమాన్యుడు- పేర్కొనదగిన వాడు, పుణ్యతముడు. అతను ఒకసారి ఏకాంత సాధన కోరి మలయ పర్వతానికి చేరి మౌనవ్రతం పూని లోకాంతరంగుడైన శ్రీకాంతుని సేవిస్తున్నాడు. భక్తుని వీక్షించాలనే అపేక్షతో అగస్త్యముని అతని వద్దకు విచ్చేశాడు.
‘నేను మౌనినై వ్రతనిష్ఠలో ఉన్నాను’ అని మహర్షిని కని కూడా ఏదో చెప్పరాని మదంతో ఇంద్రద్యుమ్నుడు ‘లేవక పూజింపక’ బిర్రబిగుసుకొని కూర్చునే ఉన్నాడు. ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అంటే ఇదే కదా! ఇది సహించని అగస్త్యముని ఆగ్రహించి- ‘మూఢ! లుబ్ధ! కరీంద్రోత్తమ యోనిఁ బుట్టు’- ‘ఓరీ మూర్ఖుడా! కృపణుడా (అజితేంద్రియుడా)! అజ్ఞానంతో కూడిన ఆత్మ (స్వరూప) స్మృతి వినాశినియైన గజయోని- ఏనుగుగా పుట్టుమ’ని రాజును శపించాడు.
‘గజానాం మందబుద్ధిః’- ఏనుగులకు దేహబలమే కాని బుద్ధిబలం ఉండదు కదా! నిత్యం కన్నా నైమిత్తికం మిన్న. మన జప తపాలు- సాధనలు నిత్యమూ ఉంటాయి. కాని, అరే మతిలేని మనిషీ! లోపాముద్రా సతీప్రియపతి అగస్త్యయతి గతి లేక వచ్చాడా? మహాపురుషుల ఆరాధనావకాశం మళ్లీమళ్లీ వస్తుందా? ఓ ఎద్దూ మొద్దూ స్వరూపమా! ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కవద్దా? ‘శ్రీవిష్ణోరవ మాననాత్ గురుతరం శ్రీవైష్ణవోల్లంఘనమ్’- భగవదపచారం కన్నా భక్తులపట్ల అపచారం అధిక బాధాకరం, భయంకరం! భాగవతంలో ఆది, మధ్య, అంతాలలో ఈ సిద్ధాంతానికి జ్వలంత దృష్టాంతాలు అనేకం కనిపిస్తాయి. అందువలన ఎంత ఘనుడైనా, పుణ్యాత్ముడైనా తపోధనులైన విప్రోత్తములను అవమానించరాదు. ఓ రాజేంద్రా! ఇంద్రద్యుమ్నుడు ఇభ(గజ)రాజుగా ప్రభవించాడు- పుట్టాడు.
అతని పరివారం- సేవకులు, పాలితులు ఏనుగులుగా పుట్టారు. కరిరాజుగా పుట్టినా ఆ మహారాజుకు పూర్వజన్మపు హరిచరణ సేవాసక్తి- భక్తివలన సారూప్యముక్తి లభించింది. భక్తుని (గజేంద్రుని) కంటే భక్తుని- ఇంద్రద్యుమ్నుని పాదం పట్టుకున్న మొసలికి ‘హూహూ’ గంధర్వునికి ముందుగా ముక్తి! తర్వాతే గజేంద్రునికి!
కరిరాజును కాపాడి హరి తన నిత్య సహచరి హరిణి (లక్ష్మి)తో ఇలా అన్నాడు- ‘ఓ సరోజముఖీ! వినువీధిలో నా వెంట విలాసంగా పరుగెత్తి వచ్చేటప్పుడు నీ పైటకొంగును నేను విడవకుండా పట్టి ఉన్నందుకు చిట్టీ! నా గురించి నీవేమనుకున్నావో? ఓ మగువా! నన్ను మరువని వారిని నేను మరువను. నన్ను విడిచిన వారిని నేనూ వదలివేస్తాను. ఇది గుర్తించి ఇతరులను అర్థించక నన్నే ప్రార్థించువారిని నేను తప్పక రక్షిస్తా.’ ఇందీవర శ్యాముని- ముకుందుని మధురవాక్కులు విని చిరునవ్వుల వెన్నెలలు చిందిస్తూ ఇందుముఖి ఇందిరాదేవి గోవిందునితో ఇలా విన్నవించింది- ఆది దేవా! నీవు అంతటికీ అధిపతివి. నీ పాదాలను మదిలో పదిలపరచుకొని పూజించడమే నా పని. కాన, ఏమీ ఆలోచించక స్వామివైన నిన్ను అనుసరిస్తూ వచ్చాను.
కం॥ ‘దీనుల కుయ్యాలింపను, దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్
దీనావన! నీ కొప్పును, దీన పరాధీన! దేవదేవ! మహేశా!’
‘దేవాధిదేవా! దీనబంధూ! దీనుల మొరను దయతో వినడమూ, వారిని దక్షతతో రక్షించడమూ, మేలైన దీవెనలు అందుకోవడమూ, ఓ దీనపరాధీనా! ఇవి నీకు తగినవే కదా!’ అధోక్షజుడు అంబుజాక్షిని ఆదరంగా ఆలింగనం చేసుకున్నాడు. దేవతలు జయజయధ్వానాలు చేస్తుండగా దేవదేవుడు సపరివారంగా వైకుంఠ నగరికి వేంచేశాడు.. అని చెప్పి శుకముని రాజుకు ఒప్పిదంగా ‘గజేంద్రమోక్షణ’ ఫలశ్రుతి ఇలా తెలిపాడు- ‘రాజా! నిశాంత సమయాన- తెల్లవారుజామున లేచి ప్రశాంతమైన మనసుతో అశాంతిని నిర్మూలించే ఈ కథను వినువారికి, చదువుకొనువారికి కలి కల్మషాలు కనుమరుగవుతాయి.
దుస్సప్న దుఃఖాలు దూరమవుతాయి. రుణబాధలు, మనోవ్రణ వ్యథలు తీరుతాయి. సర్వ సంకటాలూ శమిస్తాయి. చనిపోయే సమయంలో చక్కని గతిని కలిగించే చతురమతిని- శ్రీపతి మీది (తనపై) బుద్ధిని ప్రసాదిస్తానని పరమ పురుషుడు ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు.’ ఈ కథ ముగింపులోని ఇంపుసొంపుల పెంపుదల అమాత్యుని ఆత్మీయ అనుభూతియే!
(సశేషం)