Yadadri Temple EO Geetha | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగం కావడం స్వామి అనుగ్రహం. ఈ సమయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. స్వామికార్యాన్ని బాధ్యతతో నిర్వర్తించాను. ఈ ప్రయాణాన్ని మాటల్లో చెప్పలేను. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనిచేశాం. స్వామివారి కైంకర్యాల్లో ఏ లోపం రాకుండా చూసుకున్నాం. పునాది వేసింది మొదలు, ఆలయం పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ఆలయ సిబ్బంది అవసరాలను, ఆలయ సంప్రదాయాలను నిరంతరం వైటీడీఏ అధికారుల సమావేశంలో వివరించేదాన్ని. పునర్నిర్మాణంలో మాడవీధులు ఎంత విశాలంగా ఉండాలి, ఏ ప్రాంతంలో ఎంత స్థలం ఉండాలి తదితర విషయాలన్నిటిలో అధికారులు, స్థపతులతో నా అభిప్రాయాలు పంచుకునేదాన్ని. ముఖ్యమంత్రిగారి ఆలోచనలు, అభిప్రాయాలు, భక్తుల నమ్మకాలు, శాస్త్ర విషయాలు క్రోడీకరించుకొని అందరం సమష్టిగా కృషి చేశాం. నిర్మాణ సమయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. క్యూ కాంప్లెక్స్‌లో ఎక్స్కవేటర్లు, లిఫ్ట్, వీల్‌చైర్ సదుపాయాలు అందుబాటులో ఉంచాం. భవిష్యత్ అవసరాలను దష్టిలో ఉంచుకొని ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాం.
– ఎన్.గీత, కార్యనిర్వహణ అధికారి, యాదాద్రి దేవస్థానం