ఎంత చక్కని తల్లివే గౌరమ్మ..
ఎంత చల్లని తల్లివే గౌరమ్మ..
ఒక్కొక్క పోకందునా గౌరమ్మ..
ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ..
కస్తూరి చలమందునా గౌరమ్మ..
రాచబాలందునా గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
మముజూచి మాయన్నలు గౌరమ్మ..
ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ..
ఏడుమేడల మీదా గౌరమ్మ..
ఏడాదికొక దీపమూ గౌరమ్మ..
ఏడు కోటాలెక్కిరి గౌరమ్మ..
ఎలుక కోటాలెక్కిరి గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
పల్లెకోటానెక్కె గౌరమ్మ..
పత్తిర్లు దూయంగనూ గౌరమ్మ..
దొంగలేమో దోచీరీ గౌరమ్మ..
బంగారుగుండ్లవనమూ గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
తబుకులో తబికేడూ గౌరమ్మ..
ముత్యాలు తీసుకొనీ గౌరమ్మ..
గుమ్మాడి కుచ్చులతో గౌరమ్మ..
గుణముగా వచ్చీరీ గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
సొమ్ములూ పెట్టూకొని గౌరమ్మ..
ఇమ్ముగానూ వచ్చిరి గౌరమ్మ..
గుమ్మడిపువ్వులన్ని గౌరమ్మ..
గుత్తులకట్టుకొచ్చె గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
ఈడనే పెండ్లాడవే గౌరమ్మ..
ఈడనే పసుపాడవే గౌరమ్మ..
వాడవాడల జనమూ గౌరమ్మ..
వాలలాడింతురమ్మా గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥