బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి భక్తులు ఘనమైన పాకాలు నివేదన చేస్తారు.
గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరిరోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు. సాయంత్రం కాగానే పిల్లాజెల్లా అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు. మగవాళ్లు
సైతం ఈ ముచ్చటను చూసేందుకు ఉత్సాహం
కనబరుస్తారు. ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలివెళ్తారు.
‘తంగేడు పూవుల్ల చందమామ.
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ..
మళ్లెప్పుడొస్తావు చందమామ
ఏడాదికోసారి చందామామ..
నువ్వొచ్చి పోవమ్మ చందమామ’ అంటూ
తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.
– డా॥ ఆర్.కమల