తిరుమల : ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు ( Gurram Venkateshwarlu) టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్అంకిత్ టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.30 లక్షలు విరాళం ( Donation )గా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి చెంత కొనసాగుతున్న భక్తుల సందడి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 75,188 మంది భక్తులు దర్శించుకోగా 31,640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.66 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.