తపస్సు చేయడానికి కారడవుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. హిమశిఖరాలపైకి చేరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉన్నచోటే ఉండి ధ్యానం కొనసాగించవచ్చు. ధ్యానం అంటే చంచలమైన మనసును జయించడానికి ఉపయోగకరమైన ఒక ఉపకరణం, ఒక పక్రియ. అనుక్షణం సంకల్ప వికల్పాలకు గురయ్యే మనసును అలా నిలబెట్టడమే ధ్యానం. ఆలోచనా రహిత శూన్యస్థితిలో ఉంచడమే ధ్యానం. మనసు శూన్యమైనప్పుడు మానవ చైతన్యం, విశ్వ చైతన్యంతో అనుసంధానమై మనిషికి తనేంటో తెలిసిపోతుంది. తను పుట్టింది ఎందుకో తెలుసుకుంటాడు. తన గురించే కాదు సాటి జీవుల గురించి ఆలోచించే స్థితికి చేరుకుంటాడు.
ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసినంత కష్టపడాల్సిన పనిలేదు. హాయిగా సుఖాసనంలో కూర్చొని, రెండు చేతులు కలిపి, చేతి వేళ్లు జోడించి.. సహజంగా సాగే శ్వాసక్రియపై దృష్టి సారించడమే! సహజంగా జరుగుతున్న ఉఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనించాలి. మధ్యలో మనసులో పలు ఆలోచనలు వస్తుంటాయి. వాటిని వదిలేస్తూ మళ్లీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కొన్నాళ్ల సాధన తర్వాత ఓ రోజు మనసు ఆలోచనా రహిత స్థితిలోకి జారుకుటుంది. దాంతో ఆధ్యాత్మిక అవగాహన మొదలవుతుంది. గౌతముడు ధ్యాన సాధనతోనే బుద్ధుడిగా అవతరించాడు. ఆ ధ్యానమే సుమారు 2500 ఏండ్ల కిందట బుద్ధుడు ఆచరించిన ‘ఆనాపానసతి’. ‘ఆన’ అంటే లోపలకి వెళ్లే శ్వాస. ‘అపాన’ అంటే బయటకు వచ్చే గాలి. ‘సతి’ అంటే వాటితో కలిసి ఉండటం.
‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని బ్రహ్మర్షులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టడంతో మీకు ఏ ఆలోచనలుండవు. మీరు చేస్తున్న పనిలో మీ నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించగలుగుతారు. పనిలేకుంటే శ్వాస మీద ధ్యాసతో అనవసరపు ఆలోచనలు మీ దరికి చేరవు. ధ్యానంతో అక్కరకు రాని సమాచారాన్ని వడబోసే సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు స్పష్టమైనవిగా ఉంటాయి. బుద్ధి వికసిస్తుంది. జీవన సౌందర్యం అవగతం అవుతుంది. దైవికశక్తి విశిష్టత తెలుస్తుంది. మనిషిని క్షణక్షణం వెంటాడే మరణ భయం కూడా మాయమైపోతుంది. అతీతమైన స్థితికి చేరిన మనిషికి చివరకు మిగిలేది అనంతమైన తృప్తి. అచంచలమైన విశ్వాసం. ఈ రెండూ సాధించిన మానవ జన్మ ధన్యమని అనకుండా ఉండలేం!
…? రామకీర్తన