Dharmapuri Brahmotsavalu | ధర్మపురి : ‘కొబ్బరి బెల్లాలివిగో నారసయ్య.. కోటి దండాలయ్యో నారసయ్య.. నీ క్షేత్రానికి వస్తున్నామయ్యో నారసయ్యా.. గండాలు కడతేర్చయ్యో నారసయ్య..’ అంటూ భక్తులు ప్రతి నిత్యం ధర్మపురి క్షేత్రానికి వస్తూ ఉంటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి 29 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్ల దూరాన గోదావరి తీరాన ఉన్న ధర్మపురి క్షేత్రం దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒక మహాపుణ్య క్షేత్రం. ప్రధానంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు, మసీదులు పక్కపక్కనే ఉండి వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ క్షేత్రంలో శ్రీబ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడు అయిన శ్రీలక్ష్మీనారసింహస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరిన ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో భారత దేశంలో ఎక్కడాలేని విధంగా శ్రీయమధర్మరాజు ఆలయం ఉంది. ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు అనే నానుడి కూడా ఉంది. ఈ ధర్మపురి ఆలయం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అనగా మార్చి 3 నుంచి 15 వరకు ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు.
మార్చి 3న ఉదయం 11గంటలకు యజ్ఞాచార్యుల ఆహ్వానం, వాసుదేవ, పుణ్యాహవచనం, అంకురార్పణ, పుట్ట బంగారం తేవడం మొదలగు కార్యక్రమాలు,
మార్చి 4న సాయంత్రం 6 గంటలకు స్వామి వార్ల కల్యాణోత్సవం,
మార్చి 5న రాత్రి 7గంటలకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్ల ఊరేగింపు సేవ,
మార్చి 6న రాత్రి 7గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామివార్ల ఊరేగింపు సేవ,
మార్చి 7న మధ్యాహ్నం 3గంటలకు తెప్పోత్సవం, డోలోత్సవం,
మార్చి 8న కోనేరులో శ్రీకొత్త(ఉగ్ర) లక్ష్మీనర్సింహస్వామి వారి తెప్సోత్సవం, డోలోత్సవం,
మార్చి 9న వ కోనేరులో శ్రీవేంకటేశ్వరస్వామివార్ల తెప్సోత్సవం, డోలోత్సవం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్ల దక్షిణ దిగ్యాత్ర,
మార్చి 10న ఉత్తర దిగ్యాత్ర,
మార్చి 11న శ్రీవేంకటేశ్వర స్వామివారి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు, రాత్రి 8గంటలకు దోపోత్సవం,
మార్చి 12న పూర్ణాహుతి, 3గంటలకు రథోత్సవం, 7గంటలకు చక్రతీర్థం, శ్రీయోగా లక్ష్మీనర్సింహస్వామి వారి పుష్పయాగం,
మార్చి 13న రాత్రి 7గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగం, రాత్రి 9గంటలకు యోగా లక్ష్మీనర్సింహస్వామి వారి ఏకాంతోత్సవం,
మార్చి 14న రాత్రి 7గంటలకు శ్రీఉగ్ర నర్సింహస్వామి వారి పుష్పయాగం, రాత్రి 9గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏకాంతోత్సవం,
మార్చి 15న రాత్రి 9గంటలకు శ్రీ ఉగ్రనారసింహస్వామి వారి ఏకాంతోత్సవ కార్యక్రమాలు ఉంటాయి.