జగన్మాత అయిన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రుల్లో ఈసారి ఐదో రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నారు. ఆదిశేషుడు పాన్పుగా, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు పరివారంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువును భర్తగా కలిగి ఉన్నది మహాలక్ష్మి. లక్ష్మీదేవి చల్లని చూపులు అమృతధారలై ఈ లోకాన్ని రక్షిస్తుంటాయి. లక్ష్మీ కటాక్షంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శాశ్వతమైన మోక్షాన్ని కూడా అమ్మ అనుగ్రహిస్తుంది.
లక్ష్మీదేవి తన సౌందర్యంతో పరమాత్మను వశపరుచుకొని, భక్తుల దోషాలు ఆయన కంటపడకుండా చేస్తుందట. జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి తిరుగుతూ, పర్వతమంత పాపరాశులు కలిగి ఉన్న జీవులను పరమాత్మ శిక్షించకుండా అడ్డుకుంటుందట. అవసరమైతే ‘తప్పులేని వాడు సృష్టిలోనే లేడు’ అని పరమాత్మతో వాదనకు దిగి జీవుణ్ని రక్షిస్తుందట అమ్మ. అంతేకాదు శ్రీహరి వక్షస్థలంలో ఉండి పరమాత్మలో దయ, క్షమా గుణాలను వృద్ధిచెందేలా చేస్తుందట శ్రీలక్ష్మి.
లక్ష్మీదేవి తన పుట్టిల్లు పాలసముద్రంలో ఉన్నా, మెట్టినిల్లు వైకుంఠంలో ఉన్నా, శ్రీ మహావిష్ణువుకు తోడుగా తనూ అవతారాలు దాల్చినా.. ఇలా ప్రతి సందర్భంలోనూ జీవుల యోగక్షేమాలను పరిశీలిస్తూ, వారందరిపై ఆ పంకజనాభుడి అనుగ్రహం వర్షించేలా కృషి చేస్తుందట. లక్ష్మీదేవి.. సీతమ్మగా అశోకవనంలో ఉన్నప్పుడు, ఆమె చుట్టూ చేరి రాక్షస స్త్రీలు తనను బెదిరించినా, నిందించినా వారిని దయార్ద్రహృదయంతో క్షమించిందే కానీ, శిక్షించలేదు. శ్రీ మహాలక్ష్మి ధనం, కనకం, వస్తువాహనాలు, భూమి, గృహం, ధాన్యాది సంపదలను, ఆరోగ్యం, ఆనందం ప్రసాదిస్తుంది. అనారోగ్యం, అశుభాలు, కష్టనష్టాలు, పేదరికాన్ని రూపుమాపుతుంది. భక్తుల దుఃఖపరంపరను సమూలంగా నాశనం చేసి, లౌకికమైన ఫలితాలతోపాటు అలౌకికమైన, పారమార్థికమైన శ్రేయస్సును కలగజేస్తుంది. ఈ నవరాత్రుల శుభవేళ శ్రీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం.
– సముద్రాల శఠగోపాచార్యులు